Share News

రద్దీ సమయాల్లో వాహనాలను తనిఖీ చేయొద్దు

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:07 AM

వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పెండింగ్‌ ఈ-చలాన్‌ల తనిఖీ చేయొద్దని, రాకపోకలు క్రమబద్ధీకరించే విధుల్లోనే నిమగ్నమై ఉండాలని ట్రాఫిక్‌ పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు.

రద్దీ సమయాల్లో వాహనాలను తనిఖీ చేయొద్దు

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ విధుల్లో ఉండాల్సిందే

ట్రాఫిక్‌ పోలీసులకు సీపీ ఆదేశం

‘ఆంధ్రజ్యోతి’కి స్పందన

విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పెండింగ్‌ ఈ-చలాన్‌ల తనిఖీ చేయొద్దని, రాకపోకలు క్రమబద్ధీకరించే విధుల్లోనే నిమగ్నమై ఉండాలని ట్రాఫిక్‌ పోలీసులను సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. ‘ట్రాఫిక్‌ విధులను గాలికొదిలి...’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై సీపీ స్పందించారు. నగరంలో చాలామంది ట్రాఫిక్‌ పోలీసులు కూడళ్లలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం మానేసి, ఆ మార్గంలో వచ్చిపోయే వాహనాలను ఆపి పెండింగ్‌ ఈ-చలాన్‌లను తనిఖీ చేయడం, ఏమైనా ఉన్నట్టయితే అక్కడికక్కడే వాహన చోదకులతో కట్టించడంపైనే దృష్టిపెడుతున్నారు. రద్దీ సమయాల్లో సైతం ఇదేవిధంగా వ్యవహరిస్తుండడంతో వాహనాల రాకపోకలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో సవివరంగా కథనం ప్రచురితం కావడంతో సీపీ మంగళవారం ఉదయం ట్రాఫిక్‌ అధికారులతో టెలీఫోన్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ట్రాఫిక్‌ సిబ్బంది ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించే విధుల్లోనే ఉండాలని ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ మాత్రమే...అది కూడా ట్రాఫిక్‌ పెద్దగా లేకపోతే ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధులు నిర్వర్తించాలని స్పష్టంచేశారు. వాహనాల రాకపోకలు సక్రమంగా సాగేలా, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉల్లంఘన జరగకుండా కూడలిలోనే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు.

Updated Date - Aug 12 , 2026 | 01:07 AM