ఎన్నికల విధుల్లో అలక్ష్యం వద్దు
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:40 AM
జిల్లాలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో అలక్ష్యం ప్రదర్శించవద్దని, నిబద్ధతతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి
పీవోలు, ఏపీవోలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ
పాడేరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో అలక్ష్యం ప్రదర్శించవద్దని, నిబద్ధతతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. స్థానిక వీఆర్ ఫంక్షన్ హాలులో సోమవారం పీవోలు, ఏపీవోలకు నిర్వహించిన ఎన్నికల తొలి శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సంపూర్ణంగా తెలుసుకోవాలని, ఎన్నికల నిర్వహణపై అందించిన మాడ్యూల్, శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి ముందే పోలింగ్ నిర్వహణకు సంబంధించిన సామగ్రిని పక్కాగా సరి చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాలు, వాటి సీరియల్ నంబర్లు పరిశీలించాలని, బ్యాలెట్ పేపర్ల విషయంలో అత్యంత గోప్యత పాటించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అలక్ష్యం, పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గ దర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణలో ఏజెంట్‌ల పాత్ర, ఇతర సిబ్బంది పాత్రపై ప్రిసైడింగ్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు, భోజన, వసతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఎన్నికల సిబ్బంది ఎటువంటి సందేహాలున్నా అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలని, సంపూర్ణ అవగాహనతోనే ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, సబ్‌కలెక్టర్ కె.సాహిత్, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, డీజీవో భానుమూర్తిరాజు, టీడబ్ల్యూ డీడీ పీబీకే పరిమిళ, డీఐవో ఎస్.భీమశంకర్, డీఎల్‌పీవో పీఎస్ కుమార్, ఎన్నికల విధులు నిర్వహించే పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.