బీఎల్‌వోలకు ఇతర బాధ్యతలు అప్పగించొద్దు
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:13 PM
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగస్వామ్యులైన బూత్ స్థాయి అధికారులకు ఇతర పనులు అప్పగించవద్దని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అధికారులను శుక్రవారం ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ నిషాంతి ఆదేశం
వారితో ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ మాత్రమే చేపట్టాలని సూచన
పాడేరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగస్వామ్యులైన బూత్ స్థాయి అధికారులకు ఇతర పనులు అప్పగించవద్దని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఈమేరకు ఆమె ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బూత్ స్థాయి అధికారులకు ఇతర పనులు అప్పగిస్తే.. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ఆలస్యమవుతుందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం అత్యంత ప్రాధాన్యతగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ విషయాన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పాటించాలన్నారు. జిల్లాలోని పదకొండు మండలాల్లోని బూత్ స్థాయి అధికారులు కేవలం ఎస్‌ఐఆర్ ప్రక్రియపైన మాత్రమే దృష్టి కేంద్రీకరించాలని, ఆయా శాఖల అధికారులు సైతం బీఎల్‌వోలకు ఎటువంటి ఇతర బాధ్యతలు అప్పగించవద్దని జిల్లా కలెక్టర్ నిషాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలను అమలు చేయని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు.