Share News

మానవత్వం చాటుకున్న డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:00 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించి జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి రియాజ్‌భేగ్‌ మానవత్వం చాటుకున్నారు.

మానవత్వం చాటుకున్న డీఎంహెచ్‌వో
రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న రాంబాబును పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో రియాజ్‌భేగ్‌

రోడుపై అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని అరకులోయ ఆస్పత్రికి తరలింపు

ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌ తరలించిన వైద్యులు

అరకులోయ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంకరమెట్ట పీహెచ్‌సీని గురువారం జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి రియాజ్‌భేగ్‌ సందర్శించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాడేరుకు తిరిగి వెళుతుండగా సుంకరమెట్ట దాటిన తర్వాత బెడ్డగుడ గ్రామ సమీపాన ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురై రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఒక వ్యక్తి పడి ఉండడాన్ని ఆయన గుర్తించారు. వెంటనే వాహనాన్ని ఆపి స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ను రప్పించారు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఆసుపత్రుల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ రామును ఆదేశించారు. అరకులోయ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య సేవలందించారు. అతని తలకు తీవ్ర గాయం కావడం, చెవి నుంచి రక్తం కారడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో వైద్యం పొందుతున్నారు. ఆ వ్యక్తి ఎవరని ఆరా తీయగా బెడ్డగుడ గ్రామానికి చెందిన కొర్రా రాంబాబు (38)గా గుర్తించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాంబాబు బంధువులు తెలిపారు. అరకులోయకు చెందిన కారు రాంబాబును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్టు బంధువులు తెలిపారు. పోలీసులు కారు నడుపుతున్న వ్యక్తిని గుర్తించి, కేసు నమోదు చేయాలని రాంబాబు బంధువులు కోరుతున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:00 PM