Share News

అట్టహాసంగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:32 AM

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌, టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి బుధవారం పాడేరులో ప్రారంభించారు. అలాగే అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర ప్రారంభించారు.

అట్టహాసంగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం
అరకులోయలో దివ్యాంగులకు ఉచిత బస్సు టికెట్‌ అందజేస్తున్న ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర

6 వేల మందికి పైగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

పాడేరురూరల్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌, టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి బుధవారం పాడేరులో ప్రారంభించారు. అలాగే అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర ప్రారంభించారు.

పాడేరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో నిర్వహించిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మందికి పైగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కలుగుతుందన్నారు. సామాజిక భద్రత, దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. పారదర్శకతతో పాటు అర్హులైన ప్రతీ దివ్యాంగుడికి ఈ పథకం అందేలా చూడాలని, బస్సుల్లో వారికి ఇబ్బందులు కలగకుండా రవాణా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దివ్యాంగులతో పాటు ప్రయాణం చేసే సహాయకులకు బస్సు టికెట్‌పై 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో దివ్యాంగులు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఇంత వరకు బస్సు పాస్‌ పొందని అర్హులు ఎవరైనా ఉంటే సదరం సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు దరఖాస్తు చేసుకొని ఉచిత బస్సు పాస్‌ను పొందాలన్నారు. అనంతరం టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఈ పథకం వల్ల దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉంటుందన్నారు. అనంతరం వారు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారి పసగాడ శ్రీనివాసరావు, ఆర్టీసీ యూనియన్‌ నాయకులు చందు, ప్రసాదరావు, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:32 AM