Share News

గ్రేటర్‌ వార్డుల విభజన షురూ

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:26 AM

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ వారం కిందట ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజనను గురువారం నుంచి ప్రారంభించాలని, వచ్చే నెల ఐదో తేదీ నాటికి సరిహద్దులతో గెజిట్‌ జారీచేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీకి ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గ్రేటర్‌ వార్డుల విభజన షురూ

9వ తేదీలోగా పూర్తిచేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు

వచ్చే నెల ఐదో తేదీ నాటికి సరిహద్దులతో గెజిట్‌ జారీ

2011 జనాభా లెక్కల ప్రకారం 120 వార్డులుగా విభజన

ఈశాన్యం నుంచి ప్రారంభం

వార్డుకు సగటున 15,840 మంది జనాభా ఉండే అవకాశం

పది శాతం హెచ్చుతగ్గుదలకు వెసులుబాటు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ వారం కిందట ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజనను గురువారం నుంచి ప్రారంభించాలని, వచ్చే నెల ఐదో తేదీ నాటికి సరిహద్దులతో గెజిట్‌ జారీచేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీకి ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి వార్డుల విభజన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని జీవీఎంసీ పరిధిలో ఈశాన్యం వైపు నుంచి క్లాక్‌ వైజ్‌ డైరెక్షన్‌లో వార్డుల విభజన చేపట్టాలని సూచించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జీవీఎంసీ జనాభా 19 లక్షలు. వీరందరినీ 120 వార్డులకు సమానంగా విభజిస్తే 15,840 మంది చొప్పున ఉంటారు. వార్డు సరిహద్దుల నిర్ణయంలో సహజ సిద్ధంగా ఉండే రోడ్లు, డ్రైనేజీలు, చెరువులు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో హద్దుల నిర్ణయం క్లిష్టంగా మారితే వార్డు సగటు జనాభాలో పది శాతం ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. వార్డుల విభజన ప్రక్రియను గురువారం ప్రారంభించి ఈనెల తొమ్మిదో తేదీ నాటికి పూర్తిచేయాలని ఆదేశించింది. తర్వాత వార్డుల హద్దులతో కూడిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్‌ కార్యాలయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోని నోటీసు బోర్డులో అతికించి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని, పదో తేదీ నుంచి 16 తేదీ వరకు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేసిన తర్వాత 17వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఫైనల్‌ డ్రాఫ్ట్‌ను సీడీఎంఏకు పంపించాల్సి ఉంటుంది. జీవీఎంసీ నుంచి అందిన వార్డుల విభజన డ్రాఫ్ట్‌ను సీడీఎంఏ పరిశీలించిన తర్వాత ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నివాసిత సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, డ్రాఫ్ట్‌ను ఆమోదించడానికి ఈనెల 26 నుంచి మే రెండు వరకు అవకాశం కల్పించింది. సీడీఏంఏ ఆమోదం తర్వాత వార్డుల విభజనకు సంబంఽధించిన ఫైనల్‌ నోటిఫికేషన్‌తో కూడిన గెజిట్‌ను మే మూడు నుంచి ఐదో తేదీ లోపల జీవీఎంసీ కమిషనర్‌ విడుదల చేయాలని స్పష్టంచేసింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిర్ణయం మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జోన్‌ల పరిధిలో వార్డులు

జీవీఎంసీ పరిధిలో గతంలో ఉన్న ఎనిమిది జోన్‌ల పరిధిలో వార్డుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక్కో వార్డులో సగటున 15,840 మంది జనాభా ఉండేలా విభజన జరిగితే భీమిలి జోన్‌లో ఐదు వార్డులు, జోన్‌-2 (మధురవాడ) పరిధిలో 11 వార్డులు, జోన్‌-3 (ఆశీల్‌మెట్ట) పరిధిలో 18, జోన్‌-4 (సూర్యాబాగ్‌) పరిధిలో 15, జోన్‌-5 (జ్ఞానాపురం) పరిధిలో 28, జోన్‌-6 (గాజువాక) పరిధిలో 24, జోన్‌-7 (అనకాపల్లి) పరిధిలో 6, జోన్‌-8 (వేపగుంట) పరిధిలో 13 వార్డులు ఉండబోతున్నాయి.

Updated Date - Apr 02 , 2026 | 01:26 AM