గ్యాస్ పక్కదారి
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:06 AM
గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న వంట గ్యాస్ పక్కదారిపడుతోంది.
కొరత లేదంటూనే డెలివరీలో జాప్యం
బుక్ చేసుకున్న వారికి రెండు వారాల తరువాతే...
బయట సిలిండర్ రూ.1,500కు అమ్మకం
ఏజెన్సీలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ
విశాఖపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న వంట గ్యాస్ పక్కదారిపడుతోంది. వాణిజ్య అవసరాలకు పూర్తిగా సరఫరా నిలిపివేయడంతో వారంతా గ్యాస్ ఏజెన్సీల నుంచి కొద్దోగొప్పో దొడ్డిదారిన తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ కొరత లేదని, నిల్వలు డిమాండ్‌కు సరిపడా ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. కానీ బుకింగ్ చేసిన వారికి సిలిండర్లు మాత్రం ఇవ్వడం లేదు. వారం రోజుల క్రితం బుక్ చేసిన వారికి ఇప్పటివరకు డెలివరీ ఇవ్వలేదు. అడిగితే ఇంకో పది రోజులు పడుతుందని సమాధానం చెబుతున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పారదర్శకత శూన్యం
గ్యాస్ ఏజెన్సీల్లో అత్యధికం పారదర్శకంగా పనిచేయడం లేదు. ఎన్ని నిబంధనలు పెట్టినా వారు డొమెస్టిక్ సిలిండర్లను బయట మార్కెట్‌లో గ్యాస్ డెలివరీ బాయ్‌ల ద్వారా అధిక ధరకు అమ్ముకొని అదనపు ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు యుద్ధం వల్ల వారి బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారం మరింత పెరిగింది. మొన్నటివరకు సిలిండర్‌పై అదనంగా రూ.100 తీసుకొని అమ్మినవారు ఇప్పుడు రూ.550 తీసుకుంటున్నారు. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లను 80 శాతం తగ్గించేసింది. రెగ్యులర్ వినియోగదారులు, పెద్ద పెద్ద ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా అందిస్తోంది. కానీ నగరంలో రోడ్ల పక్కన టిఫిన్ దుకాణాలు నడిపేవారు, సాయంత్రం పూట నూడుల్స్ అమ్మేవారు, బిర్యానీ పాయింట్లకు గ్యాస్ ఎలా వస్తుందనేది పెద్ద ప్రశ్న. వీరు వాడేది డొమెస్టిక్ సిలిండర్లే. అవన్నీ వినియోగదారుల పేర్లతో బుక్ అయినవేనంటున్నారు.
ఇంతకుముందు ఫోన్ చేస్తే గ్యాస్ డెలివరీ బాయ్‌లు, గ్యాస్ ఏజెన్సీలో సిబ్బంది సమాధానం చెప్పేవారు. ఇప్పుడు వారు ఫోన్లు ఎత్తడం లేదు. తప్పనిసరిగా డీలర్ షాపు వద్దకు వెళ్లి సిలిండర్ బుకింగ్ ఏమైందో తెలుసుకోవలసి వస్తోంది. ఇంతకు ముందు బుక్ చేసిన రెండో రోజే సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు కొరత లేదంటూ 15 రోజులు పడుతుందని అంటున్నారు. ఏ నంబరు సిరీస్ ఇప్పుడు డెలివరీ ఇస్తున్నారో, పోనీ ఏ తేదీన బుక్ చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారో చెప్పడం లేదు. గ్యాస్ ఏజెన్సీలో వారి స్టాక్‌ను కూడా బోర్టులో డిస్‌ప్లే చేయడం లేదు.
పౌర సరఫరాల శాఖ అధికారులు బయట చిల్లర దుకాణాలపై దాడులు చేసి సిలిండర్లు పట్టుకొని కేసులు పెడుతున్నారు. కానీ గ్యాస్ ఏజెన్సీలు చేసే అక్రమాలపై ఇప్పటివరకు ఒక్క తనిఖీ కూడా జరగ లేదు. వారికి ఆయిల్ కంపెనీల సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగుల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ఏ రోజు ఎన్ని సిలిండర్లు కంపెనీ జారీ చేసింది?, వారు ఎంతమందికి పంపిణీ చేశారు? ఇంకా పెండింగ్ లిస్ట్ ఎంత?...అనేది ఏ రోజుకారోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జాబితాలు ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రదర్శించాల్సి ఉంది.
నో స్టాక్
గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టవ్‌లకు గిరాకీ
నగరంలో ఎక్కడా లభించని పరిస్థితి
విశాఖపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావం గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. సిలిండర్లకు కొరత ఏర్పడింది. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే గ్యాస్ బండ దొరకదని భావిస్తున్న జనం ఇండక్షన్ స్టవ్ (ఎలక్ర్టిక్ స్టవ్)లు కొనుగోలు చేస్తున్నారు. ఇంటికి విద్యుత్ సదుపాయం ఉంటే ఇండక్షన్ స్టవ్‌పై వంట చేసుకోవచ్చు. సాధారణంగా విద్యార్థులు, బ్యాచిలర్స్ ఎక్కువగా ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుంటారు. ప్రస్తుతం యుద్ధం ప్రభావంతో అనేకమంది ముందుజాగ్రత్తగా ఈ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. గతంలో రోజుకు ఐదారు స్టవ్‌లు విక్రయించేవాళ్లమని, గత వారం 100 వరకూ అమ్ముడైనట్టు ఒక దుకాణ యజమాని తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఎక్కడా స్టవ్‌లు లేవని సంపత్ వినాయక గుడి సమీపాన గల ఒక దుకాణ యజమాని చెప్పారు. ఆన్‌లైన్ (ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్)లో కూడా లేవు. వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతో కంపెనీలు ఒక్కసారిగా ఇండక్షన్ స్టవ్‌ల రేట్లు అమాంతంగా పెంచేశాయి. పది రోజుల క్రితం వరకూ రూ. 1,000కు ఉండగా ప్రస్తుతం రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలు చేశాయి.
ఉక్కుకు గ్యాస్ కష్టాలు
ఎల్‌పీజీ సరఫరా చేయలేమని స్పష్టం చేసిన ఐఓసీఎల్
మరో ఆరు రోజులకు సరిపడా మాత్రమే నిల్వలు
ఆ తరువాత ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం
ఢిల్లీలో పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన శూన్యం
మరోవైపు ప్లాంటులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న బ్లూమ్స్
వైర్‌రాడ్ల తయారీకి ఆటంకం
విశాఖపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఎల్‌పీజీ సరఫరా ఆగిపోయింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడం, దేశంలో ఎల్‌పీజీ నిల్వలు పరిమితంగా ఉండడంతో కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. గృహ వినియోగం, ఆస్పత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యం ఇచ్చి వాటికి మాత్రమే అవసరమైన గ్యాస్ అందిస్తున్నారు. ఇతర వాణిజ్య అవసరాలకు 20 శాతం తగ్గించామని చెబుతున్నా వాస్తవం వేరుగా ఉంది. ఈ సంక్షోభం మొదలు కాగానే స్టీల్ ప్లాంటుకు ఎల్‌పీజీ ఇచ్చే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) తాము ఇక గ్యాస్ అందించలేమని లేఖ రాసింది. అలాగైతే తాము ఇబ్బందులు పడతామని స్టీల్ యాజమాన్యం స్పందించింది. కోక్ ఓవెన్ల ద్వారా వచ్చే వృథా వాయువులు కూడా పూర్తిస్థాయిలో లేవని, దాంతో ఎల్‌పీజీపైనే ఆధారపడుతున్నామని, అది ఆగిపోతే ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, మళ్లీ ప్లాంటు నష్టాల్లోకి వెళుతుందని పేర్కొంటూ ఐఓసీఎల్‌కు యాజమాన్యం లేఖ రాసింది. అదే సమయంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ ద్వారా ఢిల్లీ పెద్దల దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లింది. తాము పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. ఇది జరిగి వారం రోజులైంది. ఒక్క టన్ను కూడా ఎల్‌పీజీ కూడా స్టీల్ ప్లాంటుకు అందలేదు. ఇక్కడ రోజుకు 13 టన్నుల ఎల్‌పీజీని ఉపయోగిస్తారు. స్టీల్ మెల్టింగ్ షాపు(ఎస్‌ఎంఎస్)లో తయారైన స్టీల్‌ను కంటిన్యువస్ కేస్టింగ్ బ్లూమ్స్ కింద కట్ చేయడానికి ఎల్‌పీజీని వాడతారు. ఈ పద్థతి తప్ప మరొక గత్యంతరం లేదు. ఆర్‌హెచ్ డీగ్యాసర్ బర్నర్లకు, ఇంజనీరింగ్ షాపుల్లో కూడా ఎల్‌పీజీని ఉపయోగిస్తారు. ఈ నెల 15వ తేదీ నాటికి అంటే ఆదివారానికి 97 టన్నులు మాత్రమే నిల్వ ఉంది. అందులో సోమవారం మరో 13 టన్నులు వినియోగించారు. ఇది ఇలా తగ్గిపోతోంది. అటు చూస్తే ఐఓసీఎల్ నుంచి ఎటువంటి సమాచారం లేదు.
గుట్టలుగా పేరుకుపోయిన బ్లూమ్స్
ఎస్‌ఎంఎస్‌లో కట్ చేసిన బ్లూమ్స్‌ను వైర్‌రాడ్స్ కింద మార్చి భవన నిర్మాణ అవసరాలకు విక్రయిస్తారు. ఇప్పుడు కోక్ ఓవోన్ వృథా వాయువులు కూడా తగ్గిపోవడంతో వైర్‌రాడ్ మిల్లులు ఆగిపోయాయి. మార్కెట్‌లో అత్యంత డిమాండ్ కలిగిన ఉత్పత్తి తగ్గిపోయింది. దాంతో ప్రైవేటు కంపెనీలకు బ్లూమ్స్‌ను పంపించి వైర్‌రాడ్లుగా మార్పిస్తున్నారు. దీనికి టన్నుకు నాలుగు వేల నంచి ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నారు. యంత్రాలు, సిబ్బంది ఉన్నా కేవలం గ్యాస్ లేకపోవడం వల్ల అదనపు వ్యయం చేయాల్సి వస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సమస్యలపై ఉక్కు మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నష్టాలు పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.