Share News

భిన్న వాతావరణం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:45 AM

నగరంలో మంగళవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రంగా ఉంది.

భిన్న వాతావరణం

ఉదయం నుంచి తీవ్రమైన ఎండ

మహారాణిపేట, గోపాలపట్నం, విశాఖ రూరల్‌లో 40 డిగ్రీలు నమోదు

సాయంత్రం ఈదురుగాలులతో వర్షం

నేడు, రేపు కూడా ఇదే తరహా వాతావరణం

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మంగళవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రంగా ఉంది. పది గంటలకే వాతావరణం వేడిగా మారింది. మధ్యాహ్నం 12 గంటలకు వడగాడ్పులు వీయడంతో ద్విచక్ర వాహనదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒంటి గంట నుంచి రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మహారాణిపేట, గోపాలపట్నం, విశాఖ రూరల్‌లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే వాతావరణ అనిశ్చితి ప్రభావంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి మేఘాలు ఆవరించాయి. ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో నగరంలో వాతావరణం కాస్త చల్లబడింది. బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత పెరుగుతుందని, సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


కాంట్రాక్టర్ల అత్యుత్సాహం

వర్క్‌ ఆర్డర్లు ఇవ్వకుండానే ‘హార్టికల్చర్‌’ పనులు ప్రారంభం

టెండర్లు రద్దు చేస్తారనే భయమే కారణమని ప్రచారం

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ‘హార్టికల్చర్‌’ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇంకా వర్క్‌ ఆర్డర్లను కమిషనర్‌ జారీ చేయకుండానే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేశారు. నగరంలో పచ్చదనం పెంపు, నిర్వహణ కోసం హార్టికల్చర్‌ విభాగం అధికారులు సుమారు రూ.12 కోట్ల అంచనా వవ్యయంతో 86 పనులకు టెండర్లు పిలిచారు. శనివారం ఓపెన్‌ చేయగా కేవలం ఒకటి, రెండు శాతం మైనస్‌కు, కొన్నింటికైతే టెండర్‌ మొత్తానికంటే అధికానికి బిడ్‌లు వేశారు. దాదాపు 70 వర్కులకు సింగిల్‌ టెండర్‌లు పడ్డాయి. దీంతో కాంట్రాక్టర్లు రింగ్‌ అయి పనులను పంచుకున్నారనే విషయం బయటపడింది. దీనిపై ‘పనులు పంచుకున్నారు’ అనే శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దీంతో కాంట్రాక్టర్లతోపాటు ఆ విభాగం అధికారుల్లో కలవరం మొదలైంది. గతంలో 40 శాతం లెస్‌కు వెళ్లిన పనులు ఇప్పుడు ఎక్కువ మొత్తానికి, అది కూడా సింగిల్‌ టెండర్లు వచ్చినందున జీవీఎంసీ కమిషనర్‌ వాటిని రద్దు చేస్తారనే ప్రచారం మొదలైంది. దీంతో అప్రమత్తమైన కాంట్రాక్టర్లు ఇంకా వర్క్‌ ఆర్డర్‌లు చేతికి అందకుండానే మంగళవారం హడావిడిగా పనులను ప్రారంభించేశారు. ఆ ఫొటోలను వాట్సాప్‌లో అధికారులకు పంపించారు. గతంలో వర్క్‌ ఆర్డర్‌ చేతికి వచ్చిన వారం, పది రోజులకు కూడా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు...ఇప్పుడు తొందరపడడం వెనుక ఉద్దేశం ఏమిటనేది ఉన్నతాధికారులు గమనించాలి. ఇదిలావుండగా ఇప్పటికే కాంట్రాక్టర్లంతా 2.5 శాతం చొప్పున వసూలుచేసి అధికారులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, అందుచేతనే సింగిల్‌ టెండర్‌లు పడినా రద్దుచేయాలని కమిషనర్‌కు ప్రతిపాదించలేదని ఆ విభాగంలోనే కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు.


అప్పన్నకు హుండీ ఆదాయం రూ.2.21 కోట్లు

సింహాచలం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

వరాహ లక్ష్మీనృసింహస్వామికి గడచిన ఇరవై రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.2.21 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈఓ జల్లేపల్లి వెంకటరావు పర్యవేక్షణలో ప్రత్యేక పరిశీలకులుగా దేవదాయ శాఖ అధికారులు బి.ప్రసాద్‌, శ్రీధర్‌ ఆధ్వర్యంలో మంగళవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో హుండీల లెక్కింపు చేపట్టారు. హుండీల ద్వారా రూ.2,21,12,845 నగదు, 54.8 గ్రాముల స్వర్ణం, 9.150 కిలోల వెండి ఆభరణాల రూపంలో లభించాయి. వాటితోపాటు 120 యుఎస్‌ డాలర్లు, ఇండోనేషియా, టాంజానియా, యుఏఈ, ఒమన్‌, సింగపూర్‌, మలేషియా, కెనడా, నేపాల్‌, ఖతార్‌, కువైట్‌, టర్కీ, సౌత్‌ ఆఫ్రికా తదితర దేశాల కరెన్సీ కూడా అప్పన్న ఖజానాకు జమ అయ్యింది. అధికారుల సమాచారం ప్రకారం సగటున రోజుకు రూ.11.05 లక్షల ఆదాయం సమకూరింది. హుండీల లెక్కింపులో పాలక మండలి సభ్యులు కరక దేముడు, మహేష్‌, సన్యాసిరావు, డిప్యూటీ ఈఓ సింగం రాధ, ఏఈఓలు వీబీ రమణమూర్తి, పిళ్లా శ్రీనివాసరావు, పంతం శ్రీనివాస్‌, శ్రీహరి సేవా వలంటీర్లు పాల్గొన్నారు.


మెకానికల్‌ విభాగం ప్రక్షాళన

17 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల బదిలీ

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా, బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇద్దరు ఏఈలకు అప్పగింత

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ మెకానిల్‌ విభాగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న 17 మంది అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను అధికారులు బదిలీ చేశారు. ప్రధాన కార్యాలయంలోని వారిని జోనల్‌ కార్యాలయాలకు, అక్కడ ఉన్న వారిని ప్రధాన కార్యాలయానికి మార్చారు. ప్రధాన కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తుండడం, సూపర్‌వైజర్‌ ఒకరు డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా, బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడుతుండడంపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 26న కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కథనంలో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమేనని అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో 17 మందిని బదిలీ చేశారు. అలాగే ఇంధనం కేటాయింపునకు సంబంధించిన వ్యవహారాలు చూసే బాధ్యత అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి కాకుండా ఇద్దరు ఏఈలకు అప్పగించారు. నీటి సరఫరా విభాగంలోని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా త్వరలో బదిలీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Jun 03 , 2026 | 12:45 AM