Share News

నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జిల్లా టాప్‌

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:23 PM

నీతి ఆయోగ్‌ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా మారుమూల గిరిజన పల్లెల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా ముందంజలో ఉందని, దీంతో నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జిల్లాకు దేశంలో ప్రథమ స్థానం దక్కిందని కలెక్టర్‌ టి.నిషాంతి వెల్లడించారు.

నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జిల్లా టాప్‌
ఇటీవల నిర్మించిన పాడేరు మండలం నందిగరువు రోడ్డు

మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే ప్రథమ స్థానం

కలెక్టర్‌ టి.నిషాంతి

ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి

పాడేరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా మారుమూల గిరిజన పల్లెల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా ముందంజలో ఉందని, దీంతో నీతి ఆయోగ్‌ ర్యాంకింగ్‌లో జిల్లాకు దేశంలో ప్రథమ స్థానం దక్కిందని కలెక్టర్‌ టి.నిషాంతి వెల్లడించారు. జిల్లాలో మారుమూల గిరిజన పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించడంలో జిల్లా యంత్రాంగం తగిన కృషి చేసిందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మారుమూల పల్లెల్లో సైతం సమర్థవంతంగా అమలు చేయడం, ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం ఈ విజయానికి కారణమని ఆమె పేర్కొన్నారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధించామన్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రథమ స్థానం దక్కడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలు సాధించి, జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని కలెక్టర్‌ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:23 PM