గిరిజన సంక్షేమంలో జిల్లా టాప్
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:34 PM
గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా టాప్‌లో నిలిచింది.
పీజీఆర్‌ఎస్ సేవల్లో నిరాశాజనకం
కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్‌లో వెల్లడి
పాడేరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ విషయాన్ని అమరావతిలో బుధవారం సీఎం చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. జిల్లా మొత్తం శత శాతం గిరిజన ప్రాంతం కావడంతో పాటు ఇక్కడ కేవలం గిరిజనుల కోసమే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటారు. దీంతో ఆయా కార్యక్రమాల అమలు తీరులో జిల్లాకు శత శాతం మార్కులు దక్కాయి. అలాగే లక్ష మందికి నైపుణ్యాభివృద్ధిలో మాత్రం 31 శాతం సాధించగా, పీఎం సూర్యఘర్‌లో మొత్తం 20 వేల మందికి గాను కేవలం 2 వేల మందికి మాత్రమే అమర్చారు. అలాగే స్వర్ణ సర్వేక్షణ్ అవార్డులు పొందలేదు. అలాగే గ్రాస్ డిస్ర్టిక్ట్ డొమిస్టక్ ప్రొడక్షన్(జీడీడీపీ)లో సైతం చాలా వెనుకబడింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో బీ-గ్రేడు రాగా, జిల్లాలోని నిధుల వినియోగంలో మాత్రం 81 శాతం నమోదైంది. జిల్లాలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సేవల్లో ప్రజల్లో సంతృప్తి శాతం తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించే వినతులకు శతశాతం పరిష్కారం చూపాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించడం లేదని తెలుస్తున్నది. దీంతో జిల్లాలో పీజీఆర్‌ఎస్‌పై ప్రజల సంతృప్తి శాతం కేవలం 61 శాతం మాత్రమే నమోదైంది. అగ్రి టెక్‌లో జిల్లాలో 24వ ర్యాంక్, సర్వీస్ సెక్టార్‌లో 27వ ర్యాంకు వచ్చింది.