జలధార- జలహారతిలో జిల్లా టాప్
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:13 PM
నీటిని సంపూర్ణంగా సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జలధార- జలహారతి’ కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్రంలోనే ఎక్కువ పనులు, అత్యధిక నీటి సామర్థ్యం సృష్టి, ఆశించిన ప్రగతి సాధించినందుకు గుర్తింపు
కలెక్టర్ నిషాంతి పర్యవేక్షణలో లక్ష్యానికి మించి జరిగిన పనులు
అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
నీటిని సంపూర్ణంగా సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జలధార- జలహారతి’ కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఎక్కువ పనులు చేపట్టడం, కొత్తగా ఎక్కువ శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించడం, జలధార- జలహారతి పనుల్లో ఆశించిన ప్రగతి సాధించడంలో జిల్లా ముందంజలో నిలిచింది.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం జలధార- జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 100 రోజుల కార్యాచరణ పేరిట పలు రకాల పనులు చేపట్టారు. నీటి సంరక్షణకు చెరువుల్లో, కాలువల్లో పూడికతీత, చెరువు గట్లు బలోపేతం, పంట కుంటల నిర్మాణం, చెక్‌డ్యామ్‌ల్లోని పూడికతీతతో పాటు పంట భూములకు నీళ్లు మళ్లించే చానళ్లల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే కొండవాలుగా ఉన్న ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణతో పాటు భూసార సంరక్షణకు గాను కందకాలు తవ్వించారు. ఆయా పనులు చేపట్టడం ద్వారా ఏజెన్సీలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.
జలధారలో ముందంజలో జిల్లా
జలధార- జలహారతి కార్యక్రమంలో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో అత్యఽధికంగా 9,427 పనులు చేపట్టిన జిల్లాగా ప్రథమ స్థానంలో నిలవగా, 8,995 పనులతో విజయనగరం ద్వితీయ, 8,289 పనులతో పార్వతీపురం మన్యం జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే ఈ పనులు చేపట్టడంతో కొత్తగా ఎక్కువ నీటి నిల్వ 62.58 లక్షల క్యూబిక్ మీటర్ల సామర్థ్యాన్ని సృష్టించడంతో ప్రథమ స్థానంలో, 33.08 క్యూబిక్ మీటర్లతో అనంతపురం రెండో స్థానంలో, 25.95 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంలో అనకాపల్లి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.