గృహ గణనలో జిల్లా టాప్
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:44 PM
గృహ గణనలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ టి.నిషాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన- 2027లో భాగంగా గృహ గణన, అంచనా జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టామన్నారు.
జిల్లాలో 1,99,507 ఇళ్లు ఉంటాయని అంచనా వేయగా, 2,03,773 గుర్తింపు
కలెక్టర్ టి.నిషాంతి వెల్లడి
జేసీ, డీఆర్‌వో, అధికారుల కృషికి అభినందనలు
పాడేరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): గృహ గణనలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ టి.నిషాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన- 2027లో భాగంగా గృహ గణన, అంచనా జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లాలోని పదకొండు మండలాల్లో మొత్తం 2,746 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షా 66 వేల 929 గృహాలు, అందులో 6 లక్షల 73 వేల 252 మంది ఉన్నారని తెలిపారు. అయితే గత 15 ఏళ్లలో గృహాలు, జనాభా పెరుగుదల నేపథ్యంలో జిల్లాలో లక్షా 99 వేల 507 గృహాలుంటాయని అధికారులు అంచనా వేశారన్నారు. కానీ సిబ్బంది చేపట్టిన గృహ గణనలో 2 లక్షల 3 వేల 73 గృహాలున్నట్టు గుర్తించారని పేర్కొన్నారు. అలాగే వాటిలో జనాభా సైతం 7 లక్షల 51 వేల 818 మంది ఉన్నట్టు గుర్తించారన్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో సెన్సస్- 2027లో భాగంగా ఇప్పటికి చేపట్టిన గృహ, అంచనా జనాభా లెక్కింపులో 111.67 శాతం నమోదు కావడంతో పాటు రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథఽమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ నిషాంతి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో తదుపరి జనగణన ప్రక్రియను గడువు నాటికి పూర్తి చేయాలన్నారు.
జేసీ, డీఆర్‌వోలకు ప్రత్యేక అభినందనలు
గృహ గణనలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావులకు కలెక్టర్ నిషాంతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే ఈ ప్రక్రియలో భాగస్వాములైన 11 మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లను కూడా అభినందించారు.