Share News

జనగణనలో జిల్లా టాప్‌

ABN , Publish Date - May 30 , 2026 | 11:46 PM

జనగణనలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. జిల్లాలోని పదకొండు మండలాల్లో 6,73,252 మందికి గానూ 7,30,047 మంది నమోదు చేశారు. దీంతో జిల్లాలో జనగణన 108 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో ఎన్‌టీఆర్‌, తిరుపతి జిల్లాలున్నాయి.

జనగణనలో జిల్లా టాప్‌
పాడేరు మండలం వంజంగిలో జనగణన నమోదు చేస్తున్న కార్యదర్శి చిన్ని

జిల్లాలో 108 శాతం పూర్తి

రాష్ట్ర స్థాయిలో అల్లూరి జిల్లా ప్రథమం

తర్వాత స్థానాల్లో ఎన్‌టీఆర్‌, తిరుపతి జిల్లాలు

జనగణనలో పాల్గొన్న అందరికీ కలెక్టర్‌ నిషాంతి అభినందనలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జనగణన మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అందులో భాగంగా ఏప్రిల్‌ నెలలో ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ జనగణనను నమోదు చేసుకునేలా స్వీయ గణనకు అవకాశం కల్పించారు. దీంతో అనేకమంది తమ మొబైల్‌, కంప్యూటర్ల ద్వారా స్వీయ గణనకు శ్రీకారం చుట్టారు. జనగణన మే నెల 30 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు సచివాలయాల వారీగా సిబ్బందిని కేటాయించి, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ప్రణాళికాబద్ధంగా జనగణనను చేపట్టారు. అందువల్లే సకాలంలో లక్ష్యానికి మించి జనగణన చేపట్టే అవకాశం దక్కిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 11 మండలాల్లో 6,73,252 మందికి గానూ లక్ష్యానికి మించి 7,30,047 మంది నమోదు చేశారు. దీంతో జిల్లాలో జనగణన 108 శాతంగా రికార్డు అయ్యింది. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ టి.నిషాంతి అభినందనలు తెలిపారు.

Updated Date - May 30 , 2026 | 11:46 PM