పేదరిక రహిత సమాజం దిశగా జిల్లా
ABN , Publish Date - Jun 18 , 2026 | 10:59 PM
పేదరిక రహిత సమాజం దిశగా జిల్లాలో అడుగులు మరింత వేగంగా పడుతున్నాయని, జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2 లక్షల 57 వేల 411గా ఉందని, జిల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీడీపీ) రూ.12,869 కోట్ల నుంచి రూ.18,300 కోట్లకు పెరిగిందని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో కలెక్టర్ టి.నిషాంతి
జిల్లా స్థూల దేశీయోత్పత్తి రూ.12,869 కోట్ల నుంచి రూ.18,300 కోట్లకు పెరిగిందని వెల్లడి
పలువురు లబ్ధిదారులకు ఆస్తులు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులు అందజేత
పాడేరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): పేదరిక రహిత సమాజం దిశగా జిల్లాలో అడుగులు మరింత వేగంగా పడుతున్నాయని, జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2 లక్షల 57 వేల 411గా ఉందని, జిల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీడీపీ) రూ.12,869 కోట్ల నుంచి రూ.18,300 కోట్లకు పెరిగిందని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక వీఆర్ ఫంక్షన్ హాలులో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి విజయోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయన్నారు. దేశంలో 12 ఏళ్లుగా సుపరిపాలనతో ఎన్నో కేంద్ర పథకాలు, నిధులు గిరిజన ప్రాంతానికి దక్కాయన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో కూటమి పాలన ఫలితంగానే ఏజెన్సీలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన జరుగుతుందన్నారు. జిల్లాలో రెండేళ్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.751 కోట్ల 92 లక్షలు, అన్నదాత సుఖీభవలో రైతులకు రూ.145 కోట్ల 41 లక్షలు అందించామన్నారు. పీఎం జన్‌మన్ యోజనలో భాగంగా ఇళ్ల లబ్ధిదారులకు రూ.312 కోట్లు వ్యయం చేశామన్నారు. పేదరిక రహిత సమాజం కోసం జిల్లాలో గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం చక్కని ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ అన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ శాఖల సమన్వయంలో జిల్లాను ముందుకు నడిపిస్తున్నారని, విజన్ -2027 దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఫలితంగానే 2023- 24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీడీపీ) రూ.12,869 కోట్ల్లు కాగా, 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.18,300 కోట్లకు పెరిగిందన్నారు. ప్రజల తలసరి ఆదాయం సైతం రూ.2 లక్షల 30 వేల 412 నుంచి రూ.2 లక్షలు 57 వేల 411లకు పెరిగిందన్నారు. విజన్- 2047లో భాగంగా పీ4 కింద లక్షా 310 బంగారు కుటుంబాలను గుర్తించి, వాటిలో 48 వేల 275 కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా తోడ్పాటు అందిస్తున్నామన్నారు. రెండేళ్లలో లక్షా 11 వేల 789 మంది విద్యార్థులకు తల్లివందనంలో భాగంగా రూ.145 కోట్ల 32 లక్షలు అందించామని చెప్పారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో 2 లక్షల 78 వేల 332 మంది వినియోగదారులకు రూ.20 కోట్ల 38 లక్షలు, రూ.7 కోట్ల 94 లక్షల వ్యయంతో 18.53 మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సాధికారతలో భాగంగా 6 వేల 487 స్వయం సహాయక సంఘాలకు పొదుపునకు రూ.314 కోట్లు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధిగా రూ.44 కోట్ల 97 లక్షలు, డీఎస్‌సీ ద్వారా జిల్లాలో 703 టీచర్ల నియామకం జరిగిందన్నారు. యువతకు ఉపాధిలో భాగంగా 21 జాబ్‌మేళాలు నిర్వహించి 622 మందికి ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పించామని, రైతులకు రూ.400 కోట్లకు పైగా రుణాలు అందించామని, 161 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు, ఎన్టీఆర్ వైద్య సేవలో 30 వేల 947 మందికి రూ.13 కోట్ల 37 లక్షల వ్యయంతో కార్పొరేట్ వైద్యం అందిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధులు, పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో పక్కాగా అమలు చేస్తూ గిరిజనుల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
కూటమి పాలనలోనే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి
ఇన్నాళ్లుగా నిర్లక్ష్యం, వివక్షకు గురైన గిరిజన ప్రాంతం కూటమి ప్రభుత్వ పాలనతోనే అభివృద్ధికి నోచుకుందని, రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య అన్నారు. గిరిజనుల కోసం కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో సైతం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన పేదల ఆకలి తీరుస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 317 స్వయం సహాయక సంఘాలకు రూ.26 కోట్ల 28 లక్షలు బ్యాంకు లింకేజీ, 210 సంఘాలకు స్త్రీనిధి పథకంలో రూ.6 కోట్ల 20 లక్షల చెక్కులను ఆయా మహిళా సంఘాల సభ్యులకు అతిథులు అందించారు. అలాగే రైతులను ప్రోత్సహించడంలో భాగం 30 శాతం రాయితీపై పలువురు రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అంతకు ముందు రెండేళ్ల కూటమి పాలనపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను అందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్‌డీవో భుజంగరావు, ఎస్‌డీసీ నీలకంఠరావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ట్రైకార్ డైరెక్టర్ కూడ కృష్ణారావు, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేశ్‌నాయుడు, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, టీడీపీ అరకు పార్లమెంట్ అఽధ్యక్షురాలు మోరోజు తేజోవతి, పాడేరు, చింతపల్లి పీఏసీఎస్‌ల పర్సన్ ఇన్‌చార్జులు డప్పోడి వెంకటరమణ, మంగతల్లి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, టీడీపీ సీనియర్ నేతలు చల్లంగి లక్ష్మణరావు, కొట్టగుళ్లి సుబ్బారావు, బీజేపీ నేతలు పాంగి రాజారావు, మఠం శాంతకుమారి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.