నైపుణ్య గణనలో జిల్లా ముందంజ
ABN , Publish Date - May 08 , 2026 | 12:29 AM
జిల్లాలో నైపుణ్య గణనలో లక్ష్యానికి చేరువగా ఉండడంతో జిల్లా ముందంజలో ఉంది. అలాగే స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో ఆశించిన ప్రగతి లేకపోగా పీఎం సూర్యఘర్ యోజనలోనూ వెనుకంజలోనే ఉంది.
పీఎం సూర్యఘర్ యోజనలో వెనుకబాటు
రైతు నమోదులో మోస్తరు ప్రగతి
స్వచ్ఛాంధ్రలో సగానికి చేరని లక్ష్యం
సీఎం చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన గణాంకాలు
పాడేరు, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నైపుణ్య గణనలో లక్ష్యానికి చేరువగా ఉండడంతో జిల్లా ముందంజలో ఉంది. అలాగే స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో ఆశించిన ప్రగతి లేకపోగా పీఎం సూర్యఘర్ యోజనలోనూ వెనుకంజలోనే ఉంది. అమరావతిలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల ఏడో సదస్సు సందర్భంగా ప్రభుత్వం జిల్లాల్లోని వివిధ రంగాలకు సంబంధించి ప్రగతి నివేదిక గణాంకాలను విడుదల చేసింది.
జిల్లాలోని 11 మండలాల్లో 1,16,712 మందికి నైపుణ్య గణన చేపట్టాలనే లక్ష్యాన్ని 95 శాతం పూర్తి చేయగా, జీడీడీపీలో మాత్రమే రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంక్ దక్కింది. అలాగే జాబ్‌మేళాల నిర్వహణలో మోస్తరు ప్రగతి నమోదైంది. 33 జాబ్‌మేళాలు లక్ష్యం కాగా, 27 నిర్వహించి 186 పరిశ్రమల్లో 635 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. రైతు నమోదులో భాగంగా ఫార్మర్ యాప్‌లో మొత్తం 1,16,172 మంది నమోదులో 64 శాతం లక్ష్యంగా సాధించగా, పీఎం సూర్యఘర్ యోజనలో మాత్రం ఆశించిన ప్రగతి లేదు. జిల్లాలో మొత్తం లక్షకు పైగా అర్హులైన విద్యుత్ వినియోగదారులుండగా, వారిలో కేవలం 11,191 మంది మాత్రమే అందుకు నమోదు చేసుకోగా, వారిలో 782 మందికి సోలార్ ప్యానెళ్లు వేసేందుకు వెండర్ గుర్తించారు. 77 మందికి మాత్రమే సోలాన్ ప్యానెళ్లను అమర్చారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ యూనిట్‌ల ఏర్పాటులోనూ వెనుకంజలోనే ఉన్నారు. జిల్లాలోని 41 ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ఒక్క కార్యాలయానికి కూడా వాటిని ఏర్పాటు చేయలేదు. అలాగే స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలోనే సగం ప్రగతి సాధించకపోవడంతో దానిలో 47 శాతం మాత్రమే లక్ష్యం సాధించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా 20,116 మంది బాలలను బడిలో చేర్పించాలని గుర్తించారు. అలాగే జిల్లాలో భూగర్భ జలాల విషయానికి వస్తే ప్రస్తుతం 9.01 మీటర్లుగా అధికారులు గుర్తించారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రతిపాదనలు వంటివి జిల్లాలో మచ్చుకైనా లేవు. జలధార వంద రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 3,696 పనులను అధికారులు గుర్తించగా, వాటిలో 927 మాత్రమే మంజూరు కాగా, 124 పనులు వివిధ దశల్లో ఉన్నాయి.