Share News

సేంద్రీయ సాగులో అగ్రగామిగా జిల్లా

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:21 AM

ప్రకృతి సేద్య విధానాలను మరింతగా విస్తరించి సేంద్రీయ సాగులో జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపాలని అధికారులను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ ఆదేశించారు.

సేంద్రీయ సాగులో అగ్రగామిగా జిల్లా
మాట్లాడుతున్న టీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌, పక్కన కలెక్టర్‌ నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ ఆదేశం

గిరిజన విద్యాభివృద్ధిలో ఆశించిన ప్రగతి సాధించకపోవడంపై అసంతృప్తి

పాడేరు, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ప్రకృతి సేద్య విధానాలను మరింతగా విస్తరించి సేంద్రీయ సాగులో జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపాలని అధికారులను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ ఆదేశించారు. గిరిజనాభివృద్ధిపై వివిధ శాఖాధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో కాఫీ పంటను విస్తరించడంతోపాటు ఇతర వ్యవసాయ, ఉద్యాన పంటల సాగును సంపూర్ణంగా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయానుబంధ పంటల సాగు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపుపై దృష్టి సారించాలన్నారు. ఎటువంటి పంటల సాగు చేపట్టినా ఆర్గానిక్‌గా ఉండేలా రైతులకు అవసరమైన శిక్షణలు అందించాలన్నారు. రానున్న రోజుల్లో ఆర్గానిక్‌ జిల్లాగా రూపుదిద్దుకోవాలని ఆయన సూచించారు. అలాగే వైద్యారోగ్య సేవలను మరింతగా మెరుగుపరచాలని, మాతాశిశువులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వంపై సంతృప్తి స్థాయి 69 శాతం ఉందని, దానిని 100 శాతానికి పెంచాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరు మరింతగా మెరుగుపడాలని ఆదేశించారు.

గిరిజన విద్యాభివృద్ధిపై అసంతృప్తి

గిరిజన విద్యాభివృద్ధిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరం టెన్త్‌లో కేవలం 46 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాదైనా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించాలన్నారు. గిరిజన విద్యార్థుల హాజరు పెంపు, టెన్త్‌లో శత శాతం ఉత్తీర్ణత, డ్రాపవుట్‌ల నివారణ, ఉపాధ్యాయుల పనితీరుపై నిత్య పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గతంలో ఏర్పడిన సమస్యలు, పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని, ఇబ్బందులను అధిగమించి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డేవిడ్‌రాజు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ విద్యాసాగరరావు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.కృష్ణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ బీవీ.నాగేశ్వరరావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మాతునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:21 AM