జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం
ABN , Publish Date - Apr 02 , 2026 | 01:25 AM
జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తానని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. రాష్ట్రాభివృద్ధికి టార్చ్ బేరర్‌లా విశాఖ సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతమయ్యేలా కృషిచేస్తానన్నారు. ప్రధానంగా ఐటీ, పరిశ్రమలు, డేటా సెంటర్లు, పర్యాటకం వంటి రంగాల్లో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తానన్నారు.
ఈ రెండింటికీ ప్రాధాన్యం
నూతన కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్
మౌలిక సదుపాయాల అభివృద్ధి,
ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రత్యేక దృష్టి
పారదర్శకత, సమర్థతతో పాలన
ప్రజలతో మమేకవుతా...సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా
విశాఖపట్నం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తానని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. రాష్ట్రాభివృద్ధికి టార్చ్ బేరర్‌లా విశాఖ సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతమయ్యేలా కృషిచేస్తానన్నారు. ప్రధానంగా ఐటీ, పరిశ్రమలు, డేటా సెంటర్లు, పర్యాటకం వంటి రంగాల్లో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తానన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా శాయశక్తులా పనిచేస్తానని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్రజలను నేరుగా కలిసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానన్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాలు పర్యటించి స్థానిక అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి, ప్రణాళికలు రూపొందిస్తానన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం, పోర్టు ఆధారిత అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ వంటివి విశాఖ అభివృద్ధికి కొత్త దిశ,దశను తీసుకువస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని విశాఖ జిల్లాను రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శకంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ, పారదర్శకత, సమర్థతతో పాలన అందించేందుకు కట్టుబడి ఉంటానన్నారు. అభివృద్ధిలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, విశాఖను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేందుకు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
నెల్లూరి వాసినే..
తాను ఆంధ్రావాడినేనని, స్వస్థలం నెల్లూరు అని, అమ్మ, నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో సబ్‌కలెక్టర్‌గా, ఐటీడీఏ పీవోగా, రాజమండ్రి మునిసిపల్ కమిషనర్‌గా, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, 2024 ఎన్నికల సమయంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా పనిచేశానన్నారు. ఆ తరువాత పన్నుల శాఖలో, ఏపీఐఐసీ ఎండీగా, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా సేవలు అందించి విశాఖ కలెక్టర్‌గా వచ్చానన్నారు. విశాఖ జిల్లాకు రావడం ఆనందంగా ఉందంటూ, ఇందుకు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కలెక్టర్‌కు తొలుత పోర్టికో వద్ద డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఏవో బీవీ రాణి స్వాగతం పలికారు. ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకున్న తరువాత జేసీ విద్యాధరి పుష్ఫగుచ్చం ఇచ్చి అభినందించారు. అనంతరం కలెక్టర్‌ను పలు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. కలెక్టర్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి అభిషిక్త్ కిషోర్ తల్లితండ్రులు, సతీమణి, కొడుకు హాజరయ్యారు.