Share News

పండుగలా పాసు పుస్తకాల పంపిణీ

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:13 AM

గత వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా కేవలం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియ పల్లెల్లో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది.

పండుగలా పాసు పుస్తకాల పంపిణీ
పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో బుధవారం పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

జిల్లా వ్యాప్తంగా 5,653 పుస్తకాల పంపిణీ లక్ష్యం

ఇప్పటికే 3,400 అందజేత

గ్రామసభలతో పంచాయతీల్లో సందడి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా కేవలం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియ పల్లెల్లో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది. గతంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫొటోతో కూడిన పాసు పుస్తకాల పంపిణీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రచార ఆర్భాటాలకు తావులేకుండా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రతో మాత్రమే పాసు పుస్తకాలను అందిస్తున్నది. ఈ క్రమంలో పంచాయతీల్లో ‘మీ భూమి- మీ హక్కు’ పేరిట రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి లబ్ధిదారులైన రైతులకు కొత్త పాసు పుస్తకాలను అందిస్తున్నారు.

3,400 మందికి పంపిణీ

జిల్లాలోని మొత్తం పదకొండు మండలాల పరిధిలో 5,653 మందికి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయాలనే లక్ష్యంతో రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 2న ప్రారంభమైన పట్టాల పంపిణీ ప్రక్రియ ఈ నెల 9తో ముగుస్తుంది. జిల్లాలో ఇప్పటికే 3,400 మందికి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయగా, గడువునాటికి మిగిలిన 2,253 మందికి పాసు పుస్తకాలను అందిస్తామని రెవెన్యూ డివిజన్‌ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతానికి అనంతగిరి మండలంలో 197 మందికి, అరకులోయలో 834, చింతపల్లిలో 158, డుంబ్రిగుడలో 151, జీకేవీధిలో 321, జి.మాడుగులలో 163, హుకుంపేటలో 764, కొయ్యూరులో 116, ముంచంగిపుట్టులో 266, పాడేరులో 237, పెదబయలు మండలంలో 193 మందికి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం కొత్త పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.

Updated Date - Jan 08 , 2026 | 12:13 AM