Share News

అచ్యుతాపురంలో మిత్రభేదం

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:07 AM

అచ్యుతాపురం ఎంపీపీ ఎన్నిక ఆద్యంతం ట్విస్టులతో సాగింది. మొత్తం 21 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను తొలుత 11 మంది మాత్రమే హాజరయ్యారు. టీడీపీకి చెందిన ఐదుగురు, ఇండిపెండెంట్లు (టీడీపీ రెబల్స్‌) మరో ఐదుగురు రాలేదు. కోరం చాలకపోవడంతో ఎన్నిక ప్రక్రియను మొదలుపెట్టలేదు. కొంతసేపటి తరువాత టీడీపీకి చెందిన ఒక సభ్యురాలు సమావేశానికి రావడంతో అధికారులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీపీగా జనసేనకు చెందిన ద్వారపురెడ్డి బాపు, వైస్‌ ఎంపీపీగా బీజేపీకి చెందిన రాజాన సన్యాసినాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఎంపీపీ ఎన్నికకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.

అచ్యుతాపురంలో మిత్రభేదం
అచ్యుతాపురం ఎంపీపీ ఎన్నికకు కొంతమంది మాత్రమే హాజరైన ఎంపీటీసీ సభ్యులు

పొత్తులో భాగంగా ఎంపీపీ పదవి జనసేనకు కేటాయింపు

ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యేలా ‘ప్రగడ’ వ్యూహం

మరో ఐదుగురు ఇండిపెండెంట్లు సైతం ఆయన శిబిరంలోనే..

ఒక టీడీపీ సభ్యురాలు బయటకు వచ్చి సమావేశానికి హాజరు

కోరం సరిపోవడంతో ఎన్నిక నిర్వహించిన అధికారులు

ఎంపీపీగా జనసేన, వైస్‌ ఎంపీపీగా బీజేపీ సభ్యుల ఎన్నిక

పారని ప్రగడ నాగేశ్వరరావు పాచికలు

అచ్యుతాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం ఎంపీపీ ఎన్నిక ఆద్యంతం ట్విస్టులతో సాగింది. మొత్తం 21 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను తొలుత 11 మంది మాత్రమే హాజరయ్యారు. టీడీపీకి చెందిన ఐదుగురు, ఇండిపెండెంట్లు (టీడీపీ రెబల్స్‌) మరో ఐదుగురు రాలేదు. కోరం చాలకపోవడంతో ఎన్నిక ప్రక్రియను మొదలుపెట్టలేదు. కొంతసేపటి తరువాత టీడీపీకి చెందిన ఒక సభ్యురాలు సమావేశానికి రావడంతో అధికారులు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీపీగా జనసేనకు చెందిన ద్వారపురెడ్డి బాపు, వైస్‌ ఎంపీపీగా బీజేపీకి చెందిన రాజాన సన్యాసినాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఎంపీపీ ఎన్నికకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.

కూటమి పొత్తులో భాగంగా మండలాధ్యక్ష పదవిని జనసేనకు కేటాయించిన విషయం తెలిసింది. అయితే ఎంపీటీసీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో పలువురు టీడీపీ, జనసేన మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. వీరిలో టీడీపీకి చెందిన ఐదుగురు (రెబల్స్‌) ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు వుండగా.. జనసేన 7, టీడీపీ 5, బీజేపీ 1, ప్రతిపక్ష వైసీపీ 3 స్థానాల్లో గెలిచాయి. ఐదుచోట్ల టీడీపీ రెబల్స్‌ విజయం సాధించారు. వీరిని పక్కనపెట్టినప్పటికీ ఎంపీపీ ఎన్నికకు అవసరమైన బలం (13) కూటమి వుంది. అయితే స్థానిక రాజకీయ కారణాలతో టీడీపీ నియోజవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఐదుగురు సభ్యులు, మరో ఐదుగురు ఇండిపెండెంట్లు హాజరు కాకుండా చేయడం ద్వారా ఎంపీపీ ఎన్నికలను వాయిదా వేయించడానికి ప్రయత్నించారు.

ఇదిలావుండగా ఆర్‌ఓ ఎం.యశ్వంత్‌, ఎంపీడీఓ ఎం.శ్రీనివాసరావు మండల కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీపీ ఎన్నికలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనసేనకు చెందిన ఏడుగురు, వైసీపీకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒకరు హాజరయారు. టీడీపీకి చెందిన ఐదుగురితోపాటు, ఇండిపెండెట్లు ఐదుగురు హాజరవ్వలేదు. మొత్తం 21 మంది సభ్యుల్లో 11 మంది మాత్రమే రావడంతో కోరం చాలలేదని అధికారులు చెప్పారు. కొద్దిసేపటి తరువాత టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు (ఖాజీపాలెం) వరదా గౌరీ సత్యవతి సమావేశానికి వచ్చారు. దీంతో కోరం సరిపోవడంతో అధికారులు సమావేశాన్ని ప్రారంభించి ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీపీగా బాపు, వైస్‌ ఎంపీపీగా సన్యాసినాయుడు ఎన్నికైనట్టు ప్రకటించారు.

టీడీపీ నుంచి బీజేపీకి మారిన వైస్‌ ఎంపీపీ పదవి

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలపై బుధవారం రాత్రి కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఎంపీపీ, కో-ఆప్షన్‌ పదవులను జనసేనకు, వైస్‌ ఎంపీపీ పదవిని టీడీపీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే గురువారం ఉదయానికి సీన్‌ మారిపోయింది. ఐదుగురు టీడీపీ సభ్యులతోపాటు మరో ఐదుగురు ఇండిపెండెంట్లతో ప్రగడ నాగేశ్వరరావు వేరు కుంపటి పెట్టుకున్నారు. వీరు సమావేశానికి రాకుండా కట్టడి చేశారు. అయితే కొంతసేపటికి ఖాజీపాలెం సభ్యురాలు వరదా గౌరీ సత్యవతి (టీడీపీ) అనూహ్యంగా బయటకు వచ్చి సమావేశానికి హాజరయ్యారు. ఈమె రాకపోయి వుంటే.. గురువారం ఎంపీపీ ఎన్నిక జరిగేది కాదు. ప్రగడ నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయంతో టీడీపీకి వైస్‌ ఎంపీపీ పదవి చేజారింది.

రాంబిల్లి ఎంపీపీగా ఇండిపెండెంట్‌

‘ప్రగడ’ ఏకపక్ష తీరే కారణమన్న విమర్శలు

రాంబిల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాంబిల్లి ఎంపీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో సైతం టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఏకపక్షంగా వ్యవహరించి, అభాసుపాలయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకుగానున టీడీపీ ఆరు, జనసేన 3, వైపీసీ 3 స్థానాల్లో గెలుపొందగా, మరో రెండుచోట్ల ఇండిపెండెంట్లు (ఒకరు టీడీపీ, మరొకరు జనసేన రెబల్స్‌) గెలిచారు. ఎంపీటీసీ ఎన్నికలకు ముందే ఎంపీపీ పదవికి వి.దిన్‌బాబు భార్య, మురకాడ ఎంపీటీసీ సభ్యురాలు వసంతవాడ లక్ష్మీనాగరత్నం పేరు తెరపైకి వచ్చింది. అయితే దిన్‌బాబు.. జనసేనకు చెందిన ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌తో సన్నిహితంగా వుంటారన్న ఉద్దేశంతో టీడీపీ నేత ప్రగడ నాగేశ్వరరావు ఎంపీపీ పదవికి ఎరిపిల్లి అప్పలరాజు పేరును తెరపైకి తెచ్చి, బుధవారం రాత్రి ఆయనకు బీ ఫారం ఇచ్చారు. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అప్పలరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీచేయగా, లక్ష్మీనాగరత్నం ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో అధికారులు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. అప్పరాజుకు మూడు ఓట్లు, లక్ష్మీనాగరత్నంకు ఆరు ఓట్లు వచ్చాయి. వైసీపీతోపాటు జనసేనకు చెందిన ఇద్దరు సభ్యులు ఎవరికీ మద్దతు తెలపలేదు. దీంతో లక్ష్మీనాగరత్నం ఎంపీపీగా (ఇండిపెండెంట్‌) ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జి.వి.లక్ష్మి ప్రకటించారు.

Updated Date - Nov 20 , 2026 | 01:07 AM