ఆస్పత్రులపై అసంతృప్తి
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:15 AM
‘ఎన్‌టీఆర్ వైద్యసేవ’ పథకం వర్తించే నెట్‌వర్క్ ఆస్పత్రుల తీరుపై రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుతున్న సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్ సర్వే చేసి, సమాచారాన్ని ఆయా శాఖలకు పంపుతోంది. ఆరోగ్య శాఖకు సంబంధించి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందించే సేవలపై ప్రజలు సంతృప్తికరంగా వెల్లడైంది.
సేవలపై ఎన్‌టిఆర్ వైద్యసేవ లబ్ధిదారుల పెదవివిరుపు
ఆరోగ్య శాఖకు అందిన ఐవీఆర్‌ఎస్ సర్వే నివేదిక
ప్రభుత్వాస్పత్రుల్లో భోజనం బాగుండడం లేదని ఫిర్యాదు
ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు వసూలు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
తనిఖీలకు అధికారుల నిర్ణయం
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):
‘ఎన్‌టీఆర్ వైద్యసేవ’ పథకం వర్తించే నెట్‌వర్క్ ఆస్పత్రుల తీరుపై రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుతున్న సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్ సర్వే చేసి, సమాచారాన్ని ఆయా శాఖలకు పంపుతోంది. ఆరోగ్య శాఖకు సంబంధించి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందించే సేవలపై ప్రజలు సంతృప్తికరంగా వెల్లడైంది.
ప్రధానంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భోజనం సరిగా ఉండడం లేదని, పారిశుధ్యం అధ్వానంగా ఉంటోందని రోగులు పేర్కొన్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నేరుగా రోగులతోనే..
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.అప్పారావు, ఇతర అధికారులు ఆస్పత్రులను సందర్శించి రోగులతో మాట్లాడుతున్నారు. ఆహారాన్ని తనిఖీ చేస్తున్నారు. మిత్రలు అందుబాటులో ఉంటున్నారో...లేదో...తెలుసుకుంటున్నారు. రోగుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేశారా?, చేస్తే ఎవరికి చెల్లించారన్న విషయాలను ఆరీ తీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్, ఆహార నాణ్యత లేనట్టయితే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపై తనిఖీలు
డాక్టర్ కె.అప్పారావు, జిల్లా కో-ఆర్డినేటర్, ఎన్‌టీఆర్ వైద్య సేవ
ఐవీఆర్‌ఎస్‌లో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపై ప్రధానంగా దృష్టిసారించి తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ రెండు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించి రోగులతో మాట్లాడుతున్నాం. వారు చెప్పే అంశాలు ఆధారంగా చేసుకుని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నాం. డబ్బులు వసూలు చేసిన ఆస్పత్రుల విషయాన్ని డిస్ర్టిక్ డిసిప్లినరీ కమిటీ ముందు పెట్టి జరిమానా వేస్తున్నాం. జిల్లాలో నెట్‌వర్క్ పరిధిలో 84 ఆస్పత్రులు ఉన్నాయి. రోగులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆస్పత్రుల్లో ఉండే మిత్రలను కూడా హెచ్చరించాం.