వైద్య సేవలకు ఆటంకం
ABN , Publish Date - Aug 18 , 2026 | 01:22 AM
జూనియర్ డాక్టర్ల సమ్మెతో సోమవారం ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. గడిచిన ఏడు రోజులుగా విధులను బహిష్కరించిన జూడాలు సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలకూ కూడా దూరంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
కేజీహెచ్‌పై జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం
ఇబ్బందిపడ్డ రోగులు
ఓపీ విభాగాల వద్ద గంటల కొద్దీ నిరీక్షణ
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్న అధికారులు
విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):
జూనియర్ డాక్టర్ల సమ్మెతో సోమవారం ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. గడిచిన ఏడు రోజులుగా విధులను బహిష్కరించిన జూడాలు సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలకూ కూడా దూరంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సాధారణంగా ఆస్పత్రిలో రోజుకు సుమారు 50 నుంచి 60 వరకు మేజర్ శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. జూనియర్ డాక్టర్ల సమ్మెతో సోమవారం 27 శస్త్ర చికిత్సలు మాత్రమే నిర్వహించారు. అలాగే, మైనర్ శస్త్ర చికిత్సలు 150 నుంచి 170 వరకు జరుగుతుంటాయి. ఇవి 29 వరకు మాత్రమే జరిగాయి. ఓపీ, ఐపీ విభాగాల్లో జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది.
పెద్దాస్పత్రికి ప్రతిరోజూ ఓపీ సేవలు పొందేందుకు సుమారు మూడు వేల మంది వస్తుంటారు. వారికి సేవలు అందించడంలో సీనియర్ వైద్యులతోపాటు జూనియర్ డాక్టర్లు అయిన పీజీలు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు, ఇంటర్న్స్ కీలకంగా ఉంటారు. ఓపీ విభాగాల్లో సీనియర్ వైద్యుల సూచనలతో రోగులను పరీక్షించడం, అవసరమైన మందులు రాయడం, కొన్నిరకాల పరీక్షలను ప్రిస్కైబ్ చేయడం వంటి విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రతి విభాగం ఓపీ కేంద్రంలో కనీసం పది మంది వరకు జూనియర్ వైద్యులు సేవలు అందిస్తుంటారు. అలాగే, వార్డుల్లో ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులకు వైద్య సేవలు అందించడంలో కూడా ముఖ్య భూమిక పోషిస్తుంటారు. సీనియర్ వైద్యులు ఇచ్చే సలహా మేరకు వారి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తూ అవసరమైన మందులు అందజేస్తుంటారు. అటువంటి వారంతా వారం నుంచి సమ్మెలో ఉండడంతో ఓపీతోపీటు ఐపీ విభాగాల్లో అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడింది.
కిక్కిరిసిన ఓపీ విభాగాలు
జూనియర్ వైద్యులు లేకపోవడంతో సోమ వారం ఓపీలో రోగులు సేవల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతి విభాగం వద్ద భారీసంఖ్యలో రోగులు బారులుతీరి కనిపించారు. జూనియర్ వైద్యులకు బదులుగా కొన్ని విభాగాల వద్ద ఎంబీబీఎస్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులు సేవలు అందించారు. అయినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు. అలాగే, ఓపీ కౌంటర్లు, పరీక్షా కేంద్రాల వద్ద కూడా భారీగా రోగులు బారులుతీరారు. వార్డుల్లో పీజీల గైర్హాజరుతో రోగులకు అవసరమైన మందులు ఇవ్వడం, వారిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నర్సింగ్ సిబ్బంది నిర్వర్తించాల్సి వచ్చింది. ఆయా విభాగాలకు చెందిన యూనిట్ చీఫ్‌లు, వైద్యులు పర్యవేక్షించినప్పటికీ అనేకచోట్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆందోళన ఉధృతం
గడిచిన వారం రోజులు ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేశారు. అత్యవసర వైద్య సేవలను బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ర్యాలీ నిర్వహించారు. తమ స్టైపెండ్‌ను వెంటనే పెంచాలని, ఇతర ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేజీహెచ్ ఇన్‌గేట్ వద్ద 11 మంది జూనియర్ వైద్యులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలో సుమారు వేయి మంది జూనియర్ వైద్యులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మజ్జి చంద్రశేఖరంనాయుడు వెల్లడించారు. సోమ వారం జూనియర్ వైద్యులు అత్యవసర వైద్య సేవలను నిలిపివేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 55 మంది నాన్ క్లినికల్ వైద్యులను మూడు షిప్టుల్లో నియమించి సేవలు అందించేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఆస్పత్రిలోని పలు విభాగాలు, క్యాజువాల్టీ, ఎమర్జన్సీ విభాగాల్లో అందుతున్న వైద్య సేవలను ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖరం నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి సోమవారం పరిశీలించారు.