గూగుల్ భూములపై వివాదం
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:27 AM
మండలంలోని తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ కోసం సమీకరించిన భూములకు సంబంధించి వివాదం తలెత్తేలా ఉంది.
నష్టపరిహారం కోసం రైతుల ఆందోళన
యంత్రాలకు అడ్డంగా బైఠాయింపు
ఆనందపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ కోసం సమీకరించిన భూములకు సంబంధించి వివాదం తలెత్తేలా ఉంది. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ బుధవారం తర్లువాడ వచ్చి డేటా సెంటర్‌కు కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపరిహారంపై స్పష్టమైన హామీ రాలేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గురువారం డేటా సెంటర్ భూముల వద్ద ఆందోళనకు దిగారు.
గ్రామస్థుల కథనం ప్రకారం...డేటా సెంటర్ కోసం భూములు తీసుకునే సమయంలో నష్టపరిహారం ఇస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో డీఆర్‌డీఏ సాయంతో బంజరు భూముల అభివృద్ధి పథకం కింద గుర్తించిన 97 ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసిన 521 మంది రైతులకు కూడా మూడు సెంట్లు చొప్పున భూమి ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో చాలాకాలంగా 25 ఎకరాలు తమ సాగులో ఉందని, అందుకు తగిన పరిహారం ఇవ్వాలని 25 మంది రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పర్యటన సమయంలో పరిహారంపై స్పందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో నష్టపరిహారం అందని 25 మంది రైతులతో పాటు మూడు సెంట్ల భూమి కోసం ఎదురుచూస్తున్న 521 మంది ఆందోళనకు దిగారు. పనులు సాగకుండా యంత్రాలకు అడ్డంపడ్డారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆనందపురం తహశీల్దార్ ఎస్.శ్రీనుబాబు, సీఐ చింతా వాసునాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు ఆ 521 మందికి మూడు సెంట్లు భూమి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు జరగనివ్వబోమని స్పష్టంచేశారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తహశీల్దారు శ్రీనుబాబు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
టమాటా రూ.14
ఎండలు తీవ్రం కావడంతో పెరుగుతున్న కొన్నిరకాల కూరగాయల ధరలు
బీరకాయలు రూ.36, బెండకాయలు రూ.30
మరికొన్ని రకాల రేట్లు తగ్గుముఖం
దొండకాయలు రూ.26, క్యారెట్ రూ.28...
విశాఖపట్నం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
వేసవి ఎండలు తీవ్రతరం కావడంతో రైతుబజార్లకు కూరగాయల రాక తగ్గుముఖం పడుతోంది. కొన్ని రకాల ధరలు కూడా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం టమాటా కిలో పది రూపాయలకే లభించేది. అది గురువారం కిలో రూ.14కు చేరింది. సీజన్ ముగియడంతో బజార్లకు వచ్చే సరకు కూడా తగ్గిపోతుందని ఎస్టేట్ అధికారులు చెబుతున్నారు. బీరకాయలు కిలో రూ.30 ఉండగా ఇప్పుడు రూ.36కి విక్రయిస్తున్నారు. బెండకాయలు రూ.26 నుంచి రూ.30కి చేరాయి. కాలీ ఫ్లవర్ కిలో రూ.14 ఉండేది. ఇప్పుడు రూ.20 చొప్పున అమ్ముతున్నారు. క్యాబేజీ రూ.10 నుంచి రూ.12కి చేశారు. చిక్కుళ్లు కిలో రూ.54 నుంచి రూ.64కి పెరిగింది. ఇవి రామభద్రపురం నుంచి వచ్చేవి. సీజన్ అయిపోవడంతో ప్రస్తుతం చాలా తక్కువగా వస్తున్నాయి.
కొన్నిరకాలు తగ్గుముఖం
కొన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దొండకాయలు రూ.30 నుంచి రూ.26కి తగ్గాయి. క్యారెట్ రూ.32 నుంచి రూ.28కి, పెన్సిల్ బీన్స్ కిలో రూ.54 నుంచి రూ.50కి, పొటల్స్ కూడా కిలో రూ.64 నుంచి రూ.60కి తగ్గాయి. కీర దోస కిలో రూ.22 నుంచి రూ.18కి తగ్గింది. పచ్చిమిర్చి రూ.30 నుంచి రూ.26కి తగ్గింది. కాప్సికమ్ కిలో రూ.44 నుంచి రూ.40కి వచ్చింది. ఉల్లిపాయలు కిలో రూ.18, బంగాళాదుంపలు కిలో రూ.10కే దొరుకుతున్నాయి.
ట్రావెల్స్‌పై కొరడా
ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో బస్సులు నిలిపితే కేసులు నమోదు
రవాణా శాఖకు కలెక్టర్ ఆదేశం
తక్షణంలో రంగంలోకి దిగిన అధికారులు
విశాఖపట్నం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలిపితే కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గురువారం సాయంత్రం నుంచే రంగంలోకి దిగి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను నిలపకుండా చర్యలు తీసుకున్నారు. కాంప్లెక్స్ పరిసరాలు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద ట్రావెల్స్ బస్సులు నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహన చోదకులతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని కొందరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. కాంప్లెక్స్ సమీపంలో ట్రావెల్స్ బస్సులు నిలపకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ ఉపకమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు గురువారం సాయంత్రం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ప్రైవేటు ట్రావెల్స్ నిలపకుండా వేరొకచోటకు తరలించే ఏర్పాట్లు చేశారు.