గాజువాక సీఐ బదిలీపై పంచాయితీ
ABN , Publish Date - May 19 , 2026 | 12:48 AM
గాజువాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టింగ్ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీకి మధ్య వివాదం తలెత్తిందనే ప్రచారం జరుగుతోంది.
పార్థసారథిని బదిలీ చేయడంపై ఎమ్మెల్యే అసంతృప్తి
ఆయన్నే కొనసాగించాలంటూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్
వేరొకరికి అటాచ్‌మెంట్ ఇచ్చిన సీపీ
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
గాజువాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టింగ్ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీకి మధ్య వివాదం తలెత్తిందనే ప్రచారం జరుగుతోంది. గాజువాక సీఐగా పార్థసారథి ఉండేవారు. సీపీ కొద్దిరోజుల కిందట ఆయన్ను బదిలీ చేస్తూ వీఆర్‌లో పెట్టారు. సీఐను ఆకస్మికంగా బదిలీ చేయడంపై సీపీ శంఖబ్రతబాగ్చికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. పార్థసారథిపై ఎలాంటి ఫిర్యాదులు లేనందున మరికొంతకాలం కొనసాగించాల్సిందని ఈ సందర్భంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. పరిపాలనాపరమైన కారణాలతోనే మార్చాల్సి వచ్చిందని సీపీ చెప్పగా, తనకు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేయడం వల్ల స్థానికంగా ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే అన్నట్టు తెలిసింది. నియోజకవర్గ పరిధిలో ఒక సామాజికవర్గం నుంచి ఇబ్బంది తలెత్తకుండా తిరిగి పార్థసారథినే కొనసాగించాలని సీపీని పల్లా కోరినట్టు తెలిసింది. అయితే పార్థసారథిని తిరిగి అక్కడ కొనసాగించడం కుదరదని, వేరొకరి పేరు సూచించాలని ఎమ్మెల్యేను సీపీ కోరగా ‘మీకు నచ్చిన వ్యక్తిని నియమించుకోవాలంటూ’ ఫోన్ కట్ చేసినట్టు తెలిసింది. తాజాగా సిటీ వీఆర్‌లో ఉన్న నమ్మి గణేష్‌ను గాజువాక సీఐగా అటాచ్‌మెంట్ చేస్తూ సీపీ సోమవారం ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.
మండే
నేటి నుంచి వడగాడ్పులు కూడా...
రేపు 45 నుంచి 47 డిగ్రీల వరకూ నమోదు
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
ఎండ తీవ్రతకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లావాసులు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం నుంచి ఎండలు మరింత పెరిగి వడగాడ్పులు వీయనున్నాయి. మంగళవారం అనకాపల్లి జిల్లాలోని రెండు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 12 మండలాల్లో వడగాడ్పులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు, ఐదు మండలాల్లో వడగాడ్పులు, విశాఖపట్నం జిల్లాలో ఒక మండలంలో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకూ నమోదవుతాయని పేర్కొంది. ఇక బుధవారం అనకాపల్లి జిల్లాలో ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 16 మండలాల్లో వడగాడ్పులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు మండలాల్లో తీవ్రంగా, ఆరు మండలాల్లో వడగాడ్పులు, విశాఖపట్నం జిల్లాలో నాలుగు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, ఐదు మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకూ నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గాడ్పులు వీయనున్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఉపాధి కూలీలు, రైతులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఉదయం పది గంటలకల్లా ఇళ్లకు చేరుకుని సాయంత్రం నాలుగు గంటల తరువాత బయటకు వెళ్లాలని సూచించింది. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తాగాలని ప్రజలకు సూచించింది.