పొత్తులపై తేలని పంచాయితీ
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:04 AM
జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పంపకంపై కూటమి పార్టీల మధ్య చర్చలు శుక్రవారం కూడా ఒక కొలిక్కిరాలేదు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతోపాటు స్థానిక రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు ఎంపీపీ పదవులకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కసరత్తును ముమ్మరం చేశారు.
కూటమిలో పూర్తిస్థాయిలో కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు
నర్సీపట్నం, ‘పేట, అనకాపల్లి, పెందుర్తిలో సాఫీగా పంపకాలు
ఎలమంచిలి, చోడవరం, మాడుగులలో తేలని లెక్కలు
సగానికిపైగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మూడు పార్టీలూ నామినేషన్లు
సీట్ల సర్దుబాటుపై నేటి సాయంత్రంలోగా తుది నిర్ణయం
తదుపరి అభ్యర్థుల జాబితాలు వెల్లడి
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పంపకంపై కూటమి పార్టీల మధ్య చర్చలు శుక్రవారం కూడా ఒక కొలిక్కిరాలేదు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతోపాటు స్థానిక రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు ఎంపీపీ పదవులకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కసరత్తును ముమ్మరం చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు పలుమార్లు సమావేశాలు జరిగినప్పటికీ పలు మండలాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. జిల్లాలోని 24 జడ్పీటీసీలకుగాను మాడుగుల, చోడవరం, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి స్థానాలను జనసేన పార్టీ; పాయకరావుపేట, పెందుర్తి, కశింకోట, ఎలమంచిలి మండలాలను బీజేపీ ఆశిస్తున్నాయి. వీటిలో కొన్ని జడ్పీటీసీలు, మరికొన్ని ఎంపీపీ పదవులను ఈ రెండు పార్టీలు కోరుతున్నట్టు తెలిసింది. అయితే తమకు అధిక బలం వున్న మండలాలను జనసేన, బీజేపీ కోరడం సరికాదని టీడీపీ నాయకులు అంటున్నారు.
ఆ మూడు నియోజకవర్గాల్లో సాఫీగా..
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం, జనసేనకు చెందిన కొణతాల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ఆయా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక సాఫీగా సాగింది. నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మొత్తం ఎనిమిది జడ్పీటీసీలకు కూటమి తరపున టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట జడ్పీటీసీ నుంచి బీజేపీ, అనకాపల్లి జడ్పీటీసీ నుంచి టీడీపీ పోటీ చేయాలని ఒక ఒప్పందానికి వచ్చారు. పెందుర్తి అసెంబ్లీ పరిధిలోని సబ్బవరం మండలంలో జడ్పీటీసీని జనసేన, ఎంపీపీ పదవిని టీడీపీ తీసుకోవడానికి ఒప్పందం కుదరగా, పరవాడ మండలంలో సర్దుబాటు కొలిక్కి రాలేదు. దీంతో మూడు పార్టీల నుంచి ఆశావహులు నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి అట్టా నాగమణి, పైలా వరలక్ష్మి, జనపాల సంధ్య, రొంగలి సునీత, జనసేన నుంచి చింతకాయల సుజాత, మోటూరు నాగమణి, బీజేపీ నుంచి గొరుపూటి ధనలక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక ఎలమంచిలి, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. అంతేకాక టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎక్కువ మంది జడ్పీటీసీ టికెట్లను ఆశిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, జనసేన పార్టీల నుంచి పలువురు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా సీట్ల సర్దుబాటు సాఫీగా పూర్తవుతుందని, దీంతో మిగిలిన అభ్యర్థులు బరి నుంచి తప్పుకుంటారని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.
రోలుగుంట జడ్పీటీసీకి టీడీపీ, జనసేన నుంచి ఇద్దరేసి చొప్పున నామినేషన్లు వేశారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో టీడీపీ తరపున బంటు చిరంజీవి, సుర్ల సత్యంనాయుడు, జనసేన తరపున గొల్లు కన్నబాబు, గండి తాతాజీ నామినేషన్లు దాఖలు చేశారు.
చీడికాడ జడ్పీటీసీ టికెట్‌కు టీడీపీలో పోటీ అధికంగా వుంది. పార్టీ అధిష్ఠానం ఇంకా ఎవరి పేరును ప్రకటించకపోవడంతో పోలుపర్తి సత్యవతి, కురచా రమేశ్, ముసలినాయుడు శుక్రవారం నామినేషన్లు వేశారు. వీరిలో సత్యవతి.. వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ సతీమణి. ఆమె జడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాత్రం కురచా రమేశ్‌కు మద్దతు తెలుపుతూ, నామినేషన్ కార్యక్రమానికి తన అనుచరులతో కలిసి అనకాపల్లి వెళ్లారు.
దేవరాపల్లి జడ్పీటీసీకి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ భార్య సత్యవేణి నామినేషన్లు వేశారు. ఇక్కడ వైసీపీ నుంచి కూడా ఇద్దరు.. వేచలపు వాణి, గొర్రుపోటు రమాదేవీ నామినేషన్లు దాఖలు చేశారు.
మాడుగుల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున ఏఎంసీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఆయన తనయుడు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ, జనసేన నుంచి రాయవరపు కృష్ణ నామినేషన్లు వేశారు.
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ సోదరుడు, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి వెంకట సతీశ్ కుమార్ సతీమణి దమయంతి జనసేన తరపున రాంబిల్లి, ఎలమంచిలి జడ్‌పీటీసీలకు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఎలమంచిలి జడ్పీటీసీకి జనసేన పార్టీ నుంచి ఎలమంచిలికి చెందిన వూటకూటి రమేశ్ కూడా నామినేషన్ వేశారు. ఇక రాంబిల్లి జడ్పీటీసీకి టీడీపీ తరపున ఉమ్మడి విశాఖ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ లాలం భవానీ కూడా నామినేషన్ వేశారు.
కూటమి మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి కేటాయించినట్టు చెబుతున్న కశింకోట జడ్పీటీసీ స్థానానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొన్నగంటి అప్పారావు సతీమణి నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తాళ్లపాలెం నుంచి అనకాపల్లికి ర్యాలీగా వెళ్లారు.
ఎంపీటీసీల సర్దుబాటుపై చర్చలు
ఎంపీటీసీ స్థానాల పంపకంపైనా మండలాల వారీగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతి మండలంలో స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సీట్లను సర్దుబాటు చేసుకోవడంతోపాటు అభ్యర్థులను ఖరారు చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన ఆశావహులు ఇప్పటికే నామినేషన్లు వేయడంతో శనివారం సాయంత్రంలోగా సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకుని, అనంతరం అభ్యర్థుల జాబితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.