ఉక్కులో వివక్ష
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:25 AM
ఉక్కు యాజమాన్యం అధికారులను ఒకలా, కార్మికులను ఇంకోలా చూస్తోంది.
అధికారులకు జీతంతో పాటు ప్రోత్సాహకాలు
ఒక్కొక్కరికి సుమారు రూ.22 వేలు మంజూరు
కార్మికులకు మాత్రం వేతన బకాయిలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉక్కు యాజమాన్యం అధికారులను ఒకలా, కార్మికులను ఇంకోలా చూస్తోంది. పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోంది. ఇది దసరా సమయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా బోనస్ ఆశిస్తారు. సెయిల్‌లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఏడాది దసరా బోనస్ కింద రూ.32 వేలు చొప్పున ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంటులో ఆ ఊసే లేదు. పోనీ వేతన బకాయిలైనా ఇచ్చారా?...అంటే అదీ లేదు. కానీ, ఉన్నతాధికారులకు మాత్రం ప్రోత్సాహకాలను మంజూరుచేసింది. బేసిక్ పే రూ.48 వేలు కలిగిన అధికారికి డీ.ఏ. (కరువు భత్యం) కింద రూ.1,16,000 అందుతోంది. వారికి సెప్టెంబరు నెలకు పెర్క్స్ (ప్రోత్సాహకం)గా బేసిక్‌పై 48 శాతం మంజూరుచేసింది. ఆ విధంగా ఆ అధికారికి రూ.22 వేలు మంజూరైంది. ఇలా ఉన్నతాధికారులందరికీ ప్రోత్సాహకాలు అందజేసింది. ఇటు చూస్తే కార్మికులకు రెండు నెలల నుంచి పూర్తి జీతం ఇస్తున్నా బకాయిపడిన వేతనాల గురించి మాట్లాడడం లేదు. కనీసం దసరాకు ఆ బకాయిలు ఇచ్చినా బాగుండేదని కార్మికులు అంటున్నారు.
ఉత్పత్తిలో కీలకం కార్మికులే
ఉక్కు కర్మాగారంలో ఇంతకు ముందు 18 వేల మంది ఉద్యోగులు, 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉండేవారు. ఎక్కువగా ఉన్నారని పేర్కొంటూ ఉద్యోగుల సంఖ్యను 8 వేలకు, కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 4వేలకు కుదించేశారు. అయితే ఉత్పత్తి మాత్రం ఇంతకు ముందులాగే తీయాలని, అన్ని విభాగాలు 100 శాతం లక్ష్యం సాధించాలని ఒత్తిడి పెడుతున్నారు. పని గంటలు కూడా పెంచేశారు. ఇంత కష్టపడి ప్లాంటు కోసం పనిచేస్తుంటే పండుగ సమయంలో కుటుంబాలు సంతోషంగా ఉండేలా ఏదో ఒక ప్రయోజనం కల్పించాల్సింది పోయి కడుపు మండేలా అధికారులకు పట్ల ఒకలా, కిందిస్థాయి వారి పట్ల ఇంకోలా యాజమాన్యం వ్యవహరించడం సమంజసంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సెయిల్‌లా బోనస్ ఇవ్వాలని, లేదంటే కనీసం వేతన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.