Share News

ఉక్కులో వివక్ష

ABN , Publish Date - May 19 , 2026 | 12:49 AM

స్టీల్‌ప్లాంటులో విచిత్రమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించిందంటూ ఉన్నతాధికారులు గత రెండేళ్లలో సుమారు ఏడు వేల మంది ఉద్యోగులను తగ్గించారు.

ఉక్కులో వివక్ష

ఓ వైపు ఉద్యోగుల తగ్గింపు

మరోవైపు కన్సల్టెంట్ల నియామకం

శాశ్వత ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కోత

బయటవారికి మాత్రం పూర్తి అలెవెన్సు

స్టీల్‌ప్లాంటులో విచిత్రమైన పరిస్థితులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ప్లాంటులో విచిత్రమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించిందంటూ ఉన్నతాధికారులు గత రెండేళ్లలో సుమారు ఏడు వేల మంది ఉద్యోగులను తగ్గించారు. ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సుల్లోనూ కోత పెట్టారు. ఇప్పుడు కన్సల్టెంట్ల పేరుతో బయట వారిని లక్షల రూపాయలు ఇచ్చి నియమించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారికి మాత్రం అన్ని రకాల అలవెన్సులకు ఇస్తామని యాజమాన్యం ఇచ్చిన ప్రకటనపై ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.

స్టీల్‌ప్లాంటులో మూడు విడతలుగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) అమలు చేసి సుమారు 1,700 మందిని ఇంటికి పంపించేశారు. కాంట్రాక్టు కార్మికుల్లో ఐదు వేల మందిని తీసేశారు. దీనికి ముందే 2020 నుంచి రిక్రూట్‌మెంట్‌ ఆపేశారు. పదోన్నతులు కూడా ఇవ్వడం మానేశారు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో రెండేళ్ల నుంచి ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్‌ ఇవ్వడం లేదు. తాజాగా మరో 1,200 మందికి వీఆర్‌ఎస్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. కాంట్రాక్టు కార్మికుల్లో మరికొంతమందిని తొలగించబోతున్నట్టు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏడు మిలియన్‌ టన్నులు కావడం వల్ల ఎక్విప్‌మెంట్‌ టెక్నాలజీ ప్రకారం ఉద్యోగుల సంఖ్య సుమారు 15 వేలు ఉండాలి. కానీ ఇప్పుడు అంతా కలిపి తొమ్మిది వేల మంది మాత్రమే ఉన్నారు. దీనికి తోడు సహజ పదవీ విరమణ, రాజీనామాలు చేసి వెళ్లిపోయేవారి సంఖ్య నెలకు 50 వరకు ఉంటోంది. పదోన్నతులు ఆరేళ్లుగా ఆపేయడం వల్ల ఫ్రంట్‌ లైన్‌లో పనిచేయాల్సిన సీజీఎం స్థాయి అధికారులు కరువయ్యారు. మరోవైపు నిర్వహణ లోపం వల్ల అనేక విభాగాలు పూర్తి సామర్థ్యంతో నడపలేకపోతున్నారు. ముడి పదార్థాల కొరత ఉంది. అధికారులకు పదోన్నతులు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చి తొమ్మిది నెలలు అవుతోంది. ఒక్కరికి ప్రమోషన్‌ ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ‘కన్సలెంట్ల నియామకం’ పేరుతో యాజమాన్యం ఇటీవల జారీచేసిన ప్రకటన కలకలం రేపుతోంది. కోక్‌ఓవెన్‌, సింటర్‌ ప్లాంటు, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌, రిఫ్రాక్టరీ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్స్‌, భద్రత తదితర విభాగాల్లో తొమ్మిది మంది కన్సల్టెంట్ల నియామకానికి ప్రకటన ఇచ్చారు. వారికి లక్ష రూపాయల జీతం, ఇతర అలవెన్సులు కూడా ఇస్తామని పేర్కొన్నారు. దీనిపై ఉక్కు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సెయిల్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారిని కన్సల్టెంట్లుగా పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇక్కడే జీఎం స్థాయిలో పనిచేసి, అనేక అవకతవకలకు పాల్పడి పదవీ విరమణ చేసిన వారిని కూడా కన్సల్టెంట్ల పేరుతో తిరిగి తీసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. ప్లాంటులో అర్హత కలిగిన సీనియర్లకే పదోన్నతులు ఇచ్చి, ఆయా బాధ్యతలు అప్పగించాలని, కన్సల్టెంట్లను తీసుకువచ్చి విశాఖ ఉక్కు ఉద్యోగుల నెత్తిన పెట్టవద్దని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 19 , 2026 | 12:49 AM