నలుగురు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు
ABN , Publish Date - May 14 , 2026 | 11:32 PM
స్థానిక ఏరియా ఆస్పత్రిలో గతంలో పనిచేసిన నలుగురు వైద్యనిపుణులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
చింతపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో గతంలో పనిచేసిన నలుగురు వైద్యనిపుణులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో స్త్రీ వైద్యనిపుణులుగా పనిచేసి, ప్రస్తుతం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎన్‌వీఎస్ సుధా శారద, నాటి ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, ప్రస్తుత దంత వైద్యాధికారి డాక్టర్ ఎస్. చందశ్రేఖరరావు, విధులకు దూరమైన ఎనస్థీషియా వైద్యులు టి. విక్రమ్, జనరల్ సర్జన్ డి. అజయ్‌బాబులపై వచ్చిన ఆరోపణలపై రూల్ 24 ఆంధ్రప్రదేశ్(సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అపీల్) రూల్స్ 1991 ఆధారంగా విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విచారణ అధికారిగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యాధికారులకు వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.