Share News

నీట్‌ రద్దుతో నైరాశ్యం

ABN , Publish Date - May 14 , 2026 | 01:35 AM

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో (బ్యాచిలర్‌ డిగ్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌’ రద్దు కావడంతో విద్యార్థుల్లో నైరాశ్యం అలముకుంది. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే ఉద్దేశంతో ఎంతోమంది విద్యార్థులు నీట్‌ కోసం తీవ్రస్థాయిలో శ్రమించారు.

నీట్‌ రద్దుతో  నైరాశ్యం

మానసిక ఒత్తిడిలో విద్యార్థులు

ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన

కొందరు చేసిన తప్పునకు అందరికీ శిక్ష విధిస్తున్నారంటూ పలువురి అసహనం

ఉన్నత స్థాయిలో వైఫల్యంపై

తల్లిదండ్రుల్లో ఆగ్రహం

ఈ నెల మూడో తేదీన జిల్లాలోని 18 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 7,987 మంది హాజరు

విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి):

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో (బ్యాచిలర్‌ డిగ్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌’ రద్దు కావడంతో విద్యార్థుల్లో నైరాశ్యం అలముకుంది. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే ఉద్దేశంతో ఎంతోమంది విద్యార్థులు నీట్‌ కోసం తీవ్రస్థాయిలో శ్రమించారు. కొంతమంది ఏడాది పాటు (లాంగ్‌ టర్మ్‌) శిక్షణ తీసుకుని మరీ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష అనంతరం విడుదల చేసిన కీ చూసుకుని మంచి మార్కులు వస్తున్నాయని ఆనందంతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయని ఎదురుచూస్తున్న తరుణంలో ‘నీట్‌’ ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందనే సమాచారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్‌కు గురిచేసింది. ఈ వ్యవహారం దేశవాప్తంగా చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నీట్‌ (యూజీ)- 2026ను రద్దు చేస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. వారం, పది రోజుల్లో కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ప్రకటన ప్రవేశ పరీక్షకు హాజరైన ఎంతోమంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ పరీక్ష కోసం రోజుల తరబడి ప్రిపేరయ్యామని, ఇప్పుడు రద్దు చేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయంతో తమ పిల్లలు కోలుకోలేని స్థితికి వెళ్లిపోయారని తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాలో ఈ నెల మూడో తేదీన 18 కేంద్రాల్లో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 7,987 మంది విద్యార్థులు హాజరయ్యారు.

రద్దు నిర్ణయంతో ఒత్తిడిలోకి విద్యార్థులు

నీట్‌కు హాజరైన విద్యార్థుల్లో ఎంతోమంది మంచి ర్యాంకులు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు. జాతీయ స్థాయిలో బెస్ట్‌ ర్యాంకులు వస్తాయని ఆశించిన విద్యార్థులు తాజా నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గడిచిన ఏడాది నుంచి శిక్షణ తీసుకున్నానని, కీ చూసిన తరువాత 615 మార్కులు వస్తాయని అంచనాకు వచ్చానని, జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు వస్తుందన్న ఆనందంతో ఉన్నానని, ఇప్పుడు పరీక్ష రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని నగర పరిధిలోని ఎంవీపీ కాలనీకి చెందిన ధాత్రి అనే విద్యార్థిని వాపోయింది. ఎక్కడో జరిగిన తప్పునకు దేశంలోని విద్యార్థులందరినీ బలి చేయడం సరికాదని, ఈ నిర్ణయం తమలాంటి విద్యార్థులకు అన్యాయం చేయడమేనని రాఘవేంద్ర అనే విద్యార్థి వాపోయాడు. నీట్‌ రద్దుతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని, ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని శ్వేత అనే విద్యార్థిని తెలిపింది. పరీక్షల నిర్వహణలో ఉన్నత స్థాయిలో వైఫల్యాన్ని తాజా వ్యవహారం మరోసారి బట్టబయలు చేసిందని, ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా సరైన నిర్ణయం తీసుకోకపోతే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఓ విద్యార్థి తండ్రి నాగేంద్రకుమార్‌ అన్నారు. గతంలోనూ ఇదే తరహాలో పేపర్‌ లీక్‌ వ్యవహారం బయటకు వచ్చిందని, అందుకు నిర్లక్ష్యమే కారణమని మరో విద్యార్థిని తల్లి నాగలక్ష్మి పేర్కొన్నారు. రూట్‌ లెవెల్‌లోనే ఈ తరహా అక్రమాలు జరుగుతున్నాయని, అక్కడ మార్పులకు శ్రీకారం చుట్టినప్పుడే వీటికి అడ్డుకట్ట పడుతుందని మరో విద్యార్థిని తల్లి నిరోష పేర్కొన్నారు.

Updated Date - May 14 , 2026 | 01:35 AM