నిర్వహణ లోపంతో నిరాదరణ
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:39 PM
మండలంలోని లంబసింగి- చింతపల్లి జాతీయ రహదారికి ఆనుకుని వున్న చిన్నగెడ్డ కాఫీ బెర్రీ పికింగ్ టూర్‌కి ఆదరణ కరువైంది.
చిన్నగెడ్డ కాఫీ బెర్రీ పికింగ్ టూర్‌కు ఆదరణ కరువు
పాడైపోతున్న బర్డ్‌నెస్ట్, ట్రీ డెక్
అదనపు సదుపాయాలు ప్రతిపాదనలకే పరిమితం
తగ్గిపోతున్న పర్యాటకుల సంఖ్య
పట్టించుకోని అధికారులు
చింతపల్లి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లంబసింగి- చింతపల్లి జాతీయ రహదారికి ఆనుకుని వున్న చిన్నగెడ్డ కాఫీ బెర్రీ పికింగ్ టూర్‌కి ఆదరణ కరువైంది. ఏపీఎఫ్‌డీసీ అధికారుల నిర్వహణ లోపం వల్ల బర్డ్‌నెస్ట్, ట్రీ డెక్ పాడైపోతున్నాయి. ప్రజాదరణ పొందిన ఈ సందర్శక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
అరకులోయ సుంకరిమెట్ట కాఫీ తోటల వద్ద ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఏర్పాటు చేసిన ‘కేన్ పిన్ వాక్’(ఉడెన్ బ్రిడ్జి)కి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దీంతో లంబసింగి సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా చిన్నగెడ్డ ఎస్టేట్ పరిధి వంగసార గ్రామ సమీపంలో రెండు ఎకరాల కాఫీ తోటల్లో ‘కాఫీ బెర్రీ పికింగ్ టూర్’ పేరిట అభివృద్ధి చేశారు. ఈ కాఫీ ఎస్టేట్‌లో భారీ వృక్షాలకు ఆనుకుని 12 అడుగుల ఎత్తులో ట్రీ డెక్‌లను ఏర్పాటు చేశారు. ఈ ట్రీ డెక్ ఎక్కేందుకు చెక్క మెట్లు ఏర్పాటు చేశారు. ఈ ట్రీ డెక్ పైనుంచి అత్యంత సుందరంగా కాఫీ తోటలు, మిరియాల పాదులు కనిపిస్తాయి. పచ్చని మొక్కల బ్యాగ్రౌండ్ సీనరీ ఉండడంతో ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కాఫీ తోటల మధ్యలోనుంచి వాకింగ్ చేసేందుకు ట్రెక్కింగ్ పాత్‌ను సిద్ధం చేశారు. పర్యాటకులు కూర్చొని ఫొటోలు తీసుకునేందుకు బర్డ్‌నెస్ట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పర్యాటక సీజన్ ముగియడంతో అతి తక్కువ మంది పర్యాటకులు ఈ కాఫీ ఎస్టేట్‌ను సందర్శిస్తున్నారు. ఈ కాఫీ ఎస్టేట్ జాతీయ రహదారికి అనుకుని వుండడంతో ఈ మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, ప్రాంతీయులు సందర్శించేందుకు ఆసక్తి చూపేవారు. వెడ్డింగ్ షూట్‌లు అధికంగా జరిగాయి.
పాడైపోతున్న బర్డ్‌నెస్ట్, ట్రీ డెక్
ఏపీఎఫ్‌డీసీ అధికారులు కాఫీ బెర్రీ పికింగ్ టూర్ నిర్వహణను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో బర్డ్‌నెస్ట్ పూర్తిగా పాడైపోయింది. ఈ నెస్ట్ వద్ద కూర్చొని ఫొటోలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఉడెన్ డెక్ సైతం శిథిలమైపోయింది. దీంతో బర్డ్‌నెస్ట్ నిరుపయోగంగా పడి వుంది. అలాగే ట్రీ డెక్ సైతం నిర్వహణ లోపం వల్ల మరమ్మతులకు గురవుతోంది.
ప్రతిపాదనలకే పరిమితమైన అదనపు సదుపాయాలు
పర్యాటక సీజన్ నాటికి చిన్నగెడ్డ కాఫీ ఏస్టేట్ ‘కాఫీ బెర్రీ పికింగ్ టూర్’ వద్ద పర్యాటకులకు అదనపు సదుపాయాలు కల్పించేందుకు ఏపీఎఫ్‌డీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు చేశారు. పర్యాటకుల కోసం ఉడెన్ బ్రిడ్జి, ట్రీ హౌస్, సైక్లింగ్ పాత్, వాకింగ్ పాత్‌లతో పాటు అదనపు ట్రీ డెక్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే అదనపు సదుపాయాలు ఏమీ ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజాదరణకు దూరమైంది. అందుబాటులో ఉన్న బర్డ్‌నెస్ట్, ట్రీడెక్‌లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొస్తే సందర్శకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఏపీఎఫ్‌డీసీ ఉన్నతాధికారులు కాఫీ బెర్రీ పికింగ్ టూర్‌ను అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత వాసులు, సందర్శకులు కోరుతున్నారు.