Share News

నిరాశపరిచిన టెన్త్‌ ఫలితాలు

ABN , Publish Date - May 01 , 2026 | 12:20 AM

జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 158 విద్యాలయాల్లోని 7,261 మంది విద్యార్థులకుగానూ 3,355 మంది ఉత్తీర్ణత సాధించగా..3,906 మంది ఫెయిలయ్యారు.

నిరాశపరిచిన టెన్త్‌ ఫలితాలు
ఈఏడాది పదో తరగతి బాలికలు(ఫైల్‌)

46.21 శాతం ఉత్తీర్ణతతో

రాష్ట్రంలో అట్టడుగున అల్లూరి జిల్లా

గత ఏడాదితో పోల్చితే 2 శాతం తగ్గుదల

గాడినపడని విద్యా వ్యవస్థ

మూడేళ్లుగా శాశ్వత డీఈవో లేని దుస్థితి

పాడేరు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 158 విద్యాలయాల్లోని 7,261 మంది విద్యార్థులకుగానూ 3,355 మంది ఉత్తీర్ణత సాధించగా..3,906 మంది ఫెయిలయ్యారు. దీంతో 46.21 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. గతేడాది 48 శాతం పాస్‌గా ఈ ఏడాది 46 శాతానికి దిగజారడం గమనార్హం. జిల్లాలో గురుకుల విద్యాలయాల్లో ఒక మోస్తరుగా ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ ఉన్నత, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. జిల్లాలో పాడేరు మండలంలో అత్యధికంగా 57.34 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉండగా.. కొయ్యూరు మండలంలో 24.44 శాతంతో ఆఖరు స్థానంలో నిలిచింది.

గాడిన పడని విద్యా వ్యవస్థ

జిల్లాలో విద్యా వ్యవస్థ మెరుగుపడకపోవడంతో ఈఏడాది టెన్త్‌లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఉమ్మడి జిల్లాను విడదీసి పోలవరం జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ నేటికీ విద్యావ్యవస్థలో ఉమ్మడిగానే కొన్ని వ్యవహారాలు సాగుతున్నాయి. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విద్యా వ్యవస్థను పర్యవేక్షించే జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు గత మూడేళ్లుగా ఖాళీగానే ఉంది. పాడేరు డివిజన్‌కు మాత్రమే పరిమితమయ్యే ఏజెన్సీ డీఈవోకే ఇన్నాళ్లుగా జిల్లా విద్యాశాఖాధికారి పోస్టును ఇన్‌చార్జిగా అప్పగించారు. ఏడాది క్రితమే శాశ్వత డీఈవో పోస్టు భర్తీ చేశారు. అలాగే ఉమ్మడి జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో ఆశించిన స్థాయిలో విద్యాలయాలను పర్యవేక్షించలేని పరిస్థితి. దీంతో ఆశించిన స్థాయిలో విద్యావ్యవస్థను గాడిన పెట్టే అవకాశం లేకుండా పోయింది. పాడేరు డివిజన్‌ పరిధిలోని 11 మండలాలు విశాఖపట్నం ఆర్‌జేడీ పరిధిలో ఉండగా, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 12 మండలాలు రాజమండ్రి ఆర్‌జేడీ పరిధిలో ఉన్నాయి. దీంతో ప్రాంతీయ, జిల్లా స్థాయిలో సైతం విద్యాలయాలపై పర్యవేక్షణ కొరవడింది. మండల విద్యాశాఖాధికారుల కొరతతో ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకే ఆయా బాధ్యతలను అప్పగిస్తుండడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేని దుస్థితి కొనసాగుతున్నది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, కేజీబీవీల్లో, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించకలేకపోయారు. ఆయా విద్యాలయాల్లో బోధన సరిగా లేకపోవడమే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ఆఖరు స్థానానికి దిగజారింది.

Updated Date - May 01 , 2026 | 12:20 AM