కనుమరుగవుతున్న అటవీ ఉత్పత్తులు
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:18 AM
విశాఖ మన్యంలో అతిథి పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా సంప్రదాయ అటవీ ఉత్పత్తులను పట్టించుకోవడం లేదు. దీంతో అవి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అతిథి పంటలుగా పేరొందిన కాఫీ, మిరియాల విస్తీర్ణం పెంపునకు ఎన్నో రాయితీలను ప్రభుత్వం ఇస్తోంది. అయితే సంప్రదాయ ఉత్పత్తులైన ఉసిరి, నరమామిడి, కోవెల జిగురు, కొండ చీపుళ్లు, తేనె, అడ్డాకులు వంటి తదితర వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు వీటి గురించి తెలియని పరిస్థితి ఏర్పడనుంది.
అతిథి పంటలు కాఫీ, మిరియాలకు ప్రోత్సాహం
సంప్రదాయ ఉత్పత్తులపై చిన్నచూపు
మన్యంలో తగ్గిన అటవీ ఉత్పత్తుల వనాలు
కొయ్యూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మన్యం పేరు చెప్పగానే తియ్యని తేనె, కాఫీ, ఘాటైన మిరియాలు, నోరూరించే వివిధ రకాల పండ్లు గుర్తుకు వస్తాయి. వాస్తవానికి కాఫీ, మిరియాలు మన్యానికి చెందినవి కావు. కేవలం అతిఽథి పంటలుగానే పరిచయమయ్యాయి. కాఫీ సాగుకు మన్యం అనుకూలంగా ఉండడంతో విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. 1960 సంవత్సరంలో కేవలం 10 వేల ఎకరాల్లో ఉన్న కాఫీ సాగు ప్రస్తుతం నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తుతం అరకు కాఫీ పేరిట విస్తృత ప్రచారం కూడా లభిస్తున్నది. సుగంధద్రవ్యాల పంటగా పేరొందిన మిరియాలు సాగు రానురానూ పెరుగుతోంది. అయితే వీటి విస్తీర్ణం పెరుగుతుండగా.. మన్యంలో సహజసిద్ధంగా లభించే ఉసిరి, నరమామిడి, కోవెల జిగురు, కొండ చీపుళ్లు, తేనె, అడ్డాకులు వంటి తదితర ఉత్పత్త్తులు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. అతిఽథి పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం సంప్రదాయ ఉత్పత్తులను సంరక్షించడంతో సరైన శ్రద్ధ వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కనుమరుగవుతున్న వనాలు
అంతరించిపోతున్న వనాల్లో కోవెల జిగురు ఒకటి. వివిధ రకాల మందులు తయారీకి ఎక్కువగా వినియోగించే కోవెల జిగురు ధర రకాన్ని బట్టి కిలో రూ.500 నుంచి రూ.800 మధ్యలో విక్రయించేవారు. సుమారు దశాబ్దం క్రితం వరకు ఎక్కడ చూసినా అధికంగా కనిపించే కోవెల జిగురు చెట్లు ప్రస్తుతం అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కోవెల వనాల నుంచి జిగురు తీసే విధానంపై అవగాహన లేకపోవడంతో సేకరణదారులు చెట్లు నరికివేయడంతో కోవెల చెట్లు అంతరించే స్థితికి చేరుకున్నాయి. నరమామిడి చెట్లు పరిస్థితి ఇలానే తయారైంది. ఈ చెట్లు నుంచి తీసే చెక్క అగరబత్తి పరిశ్రమల్లో ముడిసరకుగా, వివిధ రకాల ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. నరమామిడి చెక్క మార్కెట్‌లో కిలో నాణ్యతను బట్టి రూ.100 నుంచి రూ.300 మధ్యలో పలుకుతోంది. ఈ చెక్క కోసం చెట్లు పూర్తిగా నరికివేయడంతో ఈ వనాల సంఖ్య తగ్గింది. మన్యంలో కొండచీపుర్లకు ప్రత్యేకత ఉంది. కొన్నాళ్ల క్రితం వారపు సంతల్లో కొండచీపుర్లకు మంచి ధర ఉండేది. ఇప్పుడు కొండచీపుర్లు సాగు తగ్గిపోవడంతో వాటి డిమాండ్ పెరిగింది. పోడు వ్యసాయం కారణంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వాటి ప్రభావం మన్యం చీపుర్లుపై పడింది. అడ్డాకులు, కరక్కాయలు, నల్ల జీడిపిక్కలు ఇంచుమించుగా కనుమరుగయ్యాయి. అటవీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ గిరిజనులకు అవగాహన కల్పించకపోవడంతో వీటిపై వచ్చే ఆదాయానికి గండిపడింది. ముఖ్యంగా ఉసిరి, తేనెకు ప్రత్యేక డిమాండ్ ఉండేది. ఒకప్పుడు నేలపాలయ్యే ఉసిరికాయలను కిలో రూ.10 నుంచి రూ.20లకు మైదాన వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఉసిరి పచ్చడి, ఆమ్లా జ్యూస్ తయారీకు ఎగుమతి చేసేవారు. కాలక్రమంలో పచ్చి ఉసిరికాయలు కంటే ఎండిన ఉసిరికాయ పప్పు జీసీసీ కొనుగోలుకు శ్రీకారం చుట్టినా ధర కిలో రూ.45లు వరకు చెల్లించేది. మైదాన వ్యాపారులు ఎండు ఉసిరి పప్పు రూ.80 నుంచి రూ.120 వరకు చెల్లించేవారు. దీంతో కొంతకాలం గిరిజనులు ఉసిరిపప్పు సేకరణపై దృష్టి సారించారు. అడవిలో గల ఉసిరిచెట్ల కొమ్మలను విచక్షణరహితంగా నరికివేయడంతో దిగుబడులు తగ్గుతూ.. ప్రస్తుతం ఈ చెట్లు కనుమరుగయ్యాయి.
జీసీసీకి వైభవం తెచ్చిన తేనె.. నేడు దొరకని పరిస్థితి
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వ్యాపారంలో 40 శాతం వాటా తేనెదే. మన్యం వ్యాప్తంగా కొనుగోలు చేసిన తేనెను రాజమండ్రి, చిత్తూరు కేంద్రాలలో శుద్ధి చేసి రిటైల్ మార్కెట్‌లో గిరిజన హానీ పేరిట జీసీసీ విక్రయిస్తున్నది. కేవలం పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల నుంచి ఒకప్పుడు 2,500 టన్నుల నుంచి 4 వేల టన్నుల వరకు తేనె దిగుబడి వచ్చేది. ప్రస్తుతం పట్టుకు తేనె సమకూర్చే రాణీ ఈగ సంతతి తగ్గిపోవడంతో 300 టన్నులు కూడా రావడం లేదు. దీనికి తోడు సేకరించిన తేనే ధర జీసీసీ అడవి తేనెకు రూ. 200లు, పెట్టె తేనెకు రూ. 250లు చెల్లిస్తుండడంతో సేకరించిన కొద్దిపాటి తేనె గిరిజనులు జీసీసీకి విక్రయించడం లేదు. గతంలో తేనె లభ్యత లేక వైభవం కూడా కోల్పోయింది. అలాగే చింతపండు, కాగుపప్పు, విప్పపప్పు, తప్సిజిగురు(బంక), శీకాకాయ, కుంకుడు కాయలు, తానికాయలు, మారేడుగెడ్డలు, ముషిడిపిక్కలు, మైనం, అండుగ జిగురు, పాతాలగరిడి వంటి అటవీ ఉత్పత్తులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సంప్రదాయ పంటలు, అటవీ ఫలసాయాలను పెంచే దిశగా చర్యలు చేస్తే మన్యానికి మరింత గుర్తింపు లభిస్తుందనే వాదన వినిపిస్తోంది.