లేటరైట్ తవ్వకాలపై భిన్నాభిప్రాయాలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:14 AM
గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో లేటరైట్ తవ్వకాలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ(పబ్లిక్ హియరింగ్)లో ఆదివాసీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
భూములిచ్చిన గిరిజనులు అనుకూలం
గిరిజన సంఘాలు, పొరుగు గ్రామాల ప్రజలు వ్యతిరేకం
ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని జేసీ శ్రీపూజ వెల్లడి
చింతపల్లి/గూడెంకొత్తవీధి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో లేటరైట్ తవ్వకాలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ(పబ్లిక్ హియరింగ్)లో ఆదివాసీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భూములు లీజుకిచ్చిన ఆదివాసీలు లేటరైట్ తవ్వకాలకు అనుకూలతను వ్యక్తం చేయగా, గిరిజన సంఘాలు, పొరుగు గ్రామాల ఆదివాసీలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. చాపరాతిపాలెం గ్రామ శివారులో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి డోకులూరు గ్రామంలో లేటరైట్ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసేందుకు జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభను నిర్వహించింది. డోకులూరు గ్రామంలో సర్వే నంబరు 01(పి)లో 11.37 హెక్టారుల్లో లేటరైట్ తవ్వకాలు నిర్వహించేందుకు గిరిజనుడు బి.రాజేంద్రప్రసాద్ దరఖాస్తు చేసుకున్నాడని, లేటరైట్ తవ్వకాలకు 26 మంది గిరిజనులు భూములను లీజుకిచ్చారని సభలో ప్రకటించారు. స్థానిక గిరిజనులు, ప్రజాసంఘాలు, ఎన్‌జీవోలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. దీంతో లేటరైట్ తవ్వకాలకు భూములిచ్చిన ఆదివాసీలు తమ అనుకూలతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా తమ భూముల్లో పంటలు పండే పరిస్థితి లేదని, లేటరైట్ తవ్వకాలు నిర్వహించడం వల్ల తమకు ఉపాధి లభిస్తుందని, తామంతా లేటరైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉన్నామని జుంబు లక్ష్మణరావుతో పాటు ఇతర గిరిజనులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై పనిచేస్తున్న ఎన్‌జీవో ప్రతినిధులు సైతం ప్రజలకు ఉపాధి కల్పించి, ప్రకృతికి హాని కలగకుండా తవ్వకాలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేశారు. అయితే భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు లేటరైట్ తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. లేటరైట్ తవ్వకాలు నిర్వహిస్తే భూగర్భ జలాలు అంతరించిపోయి పంటలు పండే పరిస్థితి లేదన్నారు. ప్రాంతీయ ఆదివాసీలు సైతం లేటరైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు, డోకులూరు గ్రామానికి చెందిన విద్యార్థి రాజు మాట్లాడుతూ చాపరాతిపాలెంలో గతంలో లేటరైట్ తవ్వకాలు జరిగాయని, ఈ తవ్వకాల వల్ల ఆదివాసీలకు ఒరిగింది ఏమీలేదన్నారు. లేటరైట్ తవ్వకాల వల్ల స్థానికేతరులు బాగుపడతారే తప్ప స్థానిక ఆదివాసీలకు ఎటువంటి లాభం ఉండదన్నారు. స్థానిక గిరిజనులు లేటరైట్ వల్ల కలిగే నష్టాలను గుర్తించి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారన్నారు. సర్పంచ్ కృష్ణారావు మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకంగా లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వరాదన్నారు. మెజారిటీ ప్రజలు లేటరైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. లేటరైట్ ప్రారంభమైతే తాగునీటి సమస్య పెరిగిపోతుందన్నారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుందన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లేటరైట్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని, పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. స్థానిక ప్రజలు, ఎన్‌జీవోలు, ప్రజాసంఘాలు గ్రామసభలో తెలియజేసిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. లేటరైట్ తవ్వకాలపై ఎవరైన ప్రజాసంఘాలు, స్థానిక గిరిజనులు పాడేరు వచ్చి వినతిపత్రాలు అందజేసినా ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సరిత, గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.కృష్ణమూర్తి, తహశీల్దార్ అన్నాజీరావు, ఎంపీడీవో రమణబాబు, సీఐ సుధాకర్, ఎస్‌ఐ సురేశ్, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.