విశాఖ ఆర్డీవోగా దిలీప్ చక్రవర్తి
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:55 AM
విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి గా సాధు దిలీప్ చక్రవర్తి నియమితులయ్యారు.
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి గా సాధు దిలీప్ చక్రవర్తి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్‌పేటలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2009 డిప్యూటీ తహశీల్దార్ల బ్యాచ్‌కు చెందిన దిలీప్‌చక్రవర్తి శ్రీకాకుళంలో ఎక్కువ కాలం పనిచేశారు. 2014లో కొద్దికాలం సబ్బవరం తహశీల్దారుగా పనిచేసిన దిలీప్ ఆ తరువాత డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. కాగా విశాఖ ఆర్డీవో పోస్టు గడచిన ఏడు నెలలుగా ఖాళీగా ఉంది. ఆర్డీవోగా పనిచేసిన శ్రీలేఖను గత ఏడాది అక్టోబరు 20వ తేదీన ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి ఇన్‌చార్జిలతో పాలన కొనసాగుతుంది. ఇదిలావుండగా ఈనెల 15వ తేదీ నుంచి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రారంభం కానున్నది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. విశాఖ ఆర్డీవో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పశ్చిమ నియోజకవర్గానికి పూర్తిస్థాయి ఈఆర్వో ఉండాలి. దీంతో విశాఖ ఆర్డీవో పోస్టును భర్తీ చేశారని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆర్డీవోగా దిలీప్ చక్రవర్తి బాధ్యతలు స్వీకరించారు.