మరో 2 రైతుబజార్లలో డిజి సేవలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:20 AM
రైతుబజార్ల నుంచి వినియోగదారుల ఇంటికి నేరుగా కూరగాయలను చేరవేసేందుకు వీలుగా ప్రారంభించిన డిజి రైతుబజార్ సేవలను నగరంలో మరో రెండుచోట్ల అందుబాటులోకి తీసుకువచ్చారు.
గోపాలపట్నం, నరసింహనగర్‌లో ప్రారంభం
ఐదు కిలోమీటర్ల పరిధిలో వినియోగదారులకు ఇంటి వద్దకే కూరగాయలు, సరకులు డెలివరీ
యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
అక్కయ్యపాలెం/గోపాలపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
రైతుబజార్ల నుంచి వినియోగదారుల ఇంటికి నేరుగా కూరగాయలను చేరవేసేందుకు వీలుగా ప్రారంభించిన డిజి రైతుబజార్ సేవలను నగరంలో మరో రెండుచోట్ల అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పీపీపీ పద్ధతిలో నరసింహనగర్, గోపాలపట్నం రైతుబజార్లలో డిజి సేవలను అధికారులు ప్రారంభించారు.
రైతుబజారుకు రాలేని వినియోగదారులకు కూరగాయలు, ఇతర సరకులను డోర్ డెలివరీ చేస్తామని నిర్వాహక సంస్థ ‘మంచింట్ సొల్యూషన్స్’ హెడ్ నల్లంతిగల్ రామ్‌చంద్ తెలిపారు. కనీసం రూ.99 విలువగల కూరగాయలు, సరకుల కొనుగోలుకు ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే పంపిస్తామన్నారు. ఇందుకోసం సర్వీస్ చార్జి వసూలు చేస్తామన్నారు. రైతులను ప్రోత్సహించడం, కొనుగోలుదారులకు తాజా కూరగాయలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ‘డిజి రైతుబజార్’ యాప్ ద్వారా సేవలు పొందవచ్చునని, ఆర్డర్ చేసిన వెంటనే స్థానిక రైతుబజారులో రైతుల నుంచే సరకులు కొనుగోలు చేసి, పంపిణీ చేస్తామన్నారు. రైతుబజారుకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారులకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. గోపాలపట్నంలో గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు నరసింహనగర్ రైతుబజారులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి పి.కొండబాబు, సహాయకుడు సత్యనారాయణ, స్టోర్ మేనేజర్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.