Share News

జీవీఎంసీలో డిజిటల్‌ పౌర సేవలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:05 AM

జీవీఎంసీలో డిజిటల్‌ పౌర సేవలకు రాష్ట్ర మునిసిపల్‌ మంత్రి డాక్టర్‌ పి.నారాయణ శనివారం రాత్రి శ్రీకారం చుట్టారు.

జీవీఎంసీలో డిజిటల్‌ పౌర సేవలు

గాజువాక నియోజకవర్గ అభివృద్ధి సమీక్షలో మునిసిపల్‌ మంత్రి నారాయణ

రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, సామాజిక భవనాలు, ఓపెన్‌ డ్రెయిన్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటన

పారిశుధ్య నిర్వహణకు రూ.1.31 కోట్లతో మూడు యంత్రాలు

గాజువాక, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీలో డిజిటల్‌ పౌర సేవలకు రాష్ట్ర మునిసిపల్‌ మంత్రి డాక్టర్‌ పి.నారాయణ శనివారం రాత్రి శ్రీకారం చుట్టారు. ప్రజల సౌకర్యార్థం మూడు ఆన్‌లైన్‌ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై జనన-మరణాల నమోదు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చునన్నారు. జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పొందే అవకాశం కల్పించామన్నారు. అదేవిధంగా నీటి కనెక్షన్‌కు కూడా జీవీఎంసీ వెబ్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

గాజువాక నియోజకవర్గ అభివృద్ధిపై జోనల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి శనివారం రాత్రి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సేవలు సులభంగా, పారదర్శకంగా, వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ గవర్నెన్స్‌కు ప్రాఽధాన్యం ఇస్తుందన్నారు. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా నగరంలో వివిధ రకాల ప్రకటన బోర్డులు, హోర్డింగ్‌లు, డిజిటల్‌ డిస్‌ప్లే ప్రకటనలకు సంబంధించి అనుమతుల కోసం ప్రైవేటు ఏజెన్సీలు ఇకపై జీవీఎంసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఫీజులు చెల్లించవచ్చునన్నారు.

పారిశుధ్య నిర్వహణలో జీవీఎంసీ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. నగర పారిశుధ్య నిర్వహణను మరింత బలోపేతం చేసే దిశగా రూ.1.31 కోట్ల విలువైన మూడు ఆధునిక యంత్రాలను మంత్రి ప్రారంభించారు. వీటిలో ఎక్స్‌కవేటర్‌, జేసీబీ, బాబ్‌క్యాట్‌ స్కీడ్‌ స్టీర్‌ లోడర్లు ఉన్నాయి.

గాజువాక నియోజకవర్గంలో..

గాజువాక నియోజకవర్గంలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, సామాజిక భవనాలు, ఓపెన్‌ డ్రైన్ల అభివృద్ధికి ప్రాఽధాన్యం ఇస్తున్నామని మంత్రి డాక్టర్‌ పి.నారాయణ తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తూ, ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి బయటకు పంపించే చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సమీక్షలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌భరత్‌, గాజువాక జోనల్‌ కమిషనర్‌ శేషాద్రి, డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు కరణంరెడ్డి నరసింగరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


ఉక్కుకు చిక్కులు

మళ్లీ ప్రమాద ఘంటికలు

తగ్గిన నగదు నిల్వలు

పొదుపు చర్యలు చేపట్టాలని ఉద్యోగ వర్గాలకు సీఎండీ హితవు

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటులో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. నగదు నిల్వలు బాగా తగ్గిపోయాయి. అంతా కలిపి చేతిలో రూ.100 కోట్లు కూడా లేవు. మార్కెట్‌ చూస్తే బాగా లేదు. స్టీల్‌ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అమ్మకాలు పెద్దగా లేవు. అమరావతి ప్రాజెక్టులకు విశాఖ స్టీల్‌ తీసుకోవాలని కోరినా పెద్దగా స్పందన రాలేదు.

ఇప్పుడు ముడిసరకు సరఫరా చేసే కంపెనీలకు బిల్లులు ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయి. వారికి చెల్లింపుల్లో జాప్యం జరిగితే బ్యాంకులు క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గించేస్తాయి. అంటే వడ్దీ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడున్న 7 శాతం వడ్డీ ఇంతకు ముందులా మళ్లీ 11 నుంచి 12 శాతానికి చేరుతుంది. ఇది సంస్థకు మోయలేని భారమే అవుతుంది.

వ్యర్థాలు, వ్యయాలు తగ్గించడమే మార్గం

ప్లాంటులో వృథాను అరికట్టడం, వ్యయాలు తగ్గించడమే అందరి ముందున్న లక్ష్యమని ఉద్యోగ వర్గాలకు శనివారం సీఎండీ సందేశం పంపారు. వ్యర్థాలను అవసరమైన చోటల్లా ఉపయోగించి ఖర్చు తగ్గించాలని, ముఖ్యంగా సింటర్‌ ప్లాంటు, బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాపుల్లో అధిక ధర కలిగిన ముడిపదార్థాల వినియోగం ఆచితూచి జరగాలని స్పష్టంచేశారు. కోక్‌ బ్రీజ్‌, మెటలర్జికల్‌ కోక్‌, పెట్‌ కోక్‌లను పొదుపు చేయాల్సి ఉందన్నారు. కోక్‌కు బదులుగా పల్వరైజ్డ్‌ కోల్‌ ఇంజెక్షన్‌ ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

గ్యాస్‌లు అందుబాటులో లేక నష్టం

ప్లాంటులో అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో నడవకపోవడం వల్ల ఆశించిన గ్యాస్‌ రావడం లేదు. దాంతో గ్యాస్‌తో నడవాల్సిన ఫినిషింగ్‌ మిల్లులు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. దాంతో పెల్లెట్లు, బ్లూమ్‌లు పెద్ద సంఖ్యలో ఉండిపోతున్నాయి. ఫినిష్డ్‌ ఉత్పత్తులు తయారుకావడం లేదు. ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు, వృథాను తగ్గించి ఉత్పత్తిని పెంచడమే లక్ష్యమని ఉద్యోగ వర్గాలకు చెబుతున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటనే దానిపై మాత్రం ఎవరూ పెదవి విప్పడం లేదు. ఢిల్లీ నుంచి ఉక్కు మంత్రిత్వ శాఖ ఇక్కడి ఉత్పత్తి, వ్యయాలు, ఉద్యోగులు, వారి పనితీరును రెండేళ్లుగా సమీక్షిస్తూ వస్తోంది. ఉక్కు సెక్రటరీ చెప్పినట్టుగానే వర్షాకాలంలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్రారంభించారు. వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించారు. అయినా సరైన ఫలితాలు లేవు. నాసిరకం ముడిపదార్థాలు కొనుగోలు చేసి పెద్ద ప్రమాదం జరగడానికి కారణమయ్యాయి. ఈ ప్రయోగాలు ఎందుకు విఫలం అయ్యాయి?, దీనికి బాధ్యులపై ఎటువంటి చర్యలు ఉంటాయనే దానిపై ప్రజా ప్రతినిధులు సమీక్షించాల్సిన సమయం వచ్చింది.


కరోనాపై అప్రమత్తం

కేజీహెచ్‌లో 17 పడకలతో ప్రత్యేక వార్డు

ఆరోగ్య కేంద్రాలకు నిర్ధారణ కిట్ల

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. వైరస్‌ బారినపడి రెండు రోజుల కిందట కడపలో ఇద్దరు మృతిచెందిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతోపాటు కేసులు నమోదైతే చికిత్స అందించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేజీహెచ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో 17 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటుచేసినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి వెల్లడించారు. ఐసోలేషన్‌ వార్డులో సిబ్బంది కోసం 30 పీపీఈ కిట్లు, సుమారు తొమ్మిది వేల ఎన్‌-95 మాస్కులు, డిస్పోజబుల్స్‌ వంటివి సిద్ధం చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జ్వరంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు లక్షణాలను బట్టి కొవిడ్‌ పరీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పట్టణ/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాధి నిర్ధారణ కిట్లు పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Updated Date - Jul 12 , 2026 | 01:05 AM