Share News

కరెంటు బిల్లింగులో కష్టాలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:32 AM

విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ నమోదులో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఈపీడీసీఎల్‌ ప్రవేశపెట్టిన ‘జియో ఫెన్సింగ్‌’ విధానం వినియోగదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. విద్యుత్తు మీటరు ఉన్న ప్రదేశానికి సిబ్బంది స్వయంగా వెళ్లి అక్కడే రీడింగ్‌ నమోదు చేయాల్సి ఉండడంతో కొత్త సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా నిర్ణీత గడువులోగా బిల్లింగ్‌ ప్రక్రియ పూర్తికాకపోవడంతో శ్లాబ్‌ మారిపోయి వినియోగదారులపై అదనపు భారం పడుతున్నది.

కరెంటు బిల్లింగులో కష్టాలు
జియో ఫెన్సింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అమర్చిన పరికరం ద్వారా విద్యుత్‌ మీటరు రీడింగ్‌ నమోదు చేస్తున్న సిబ్బంది

మీటర్‌ రీడింగ్‌ నమోదుకు కొత్త సాఫ్ట్‌వేర్‌

‘జియో ఫెన్సింగ్‌’ విధానంతో సిబ్బంది తిప్పలు

సాంకేతిక సమస్యలతో రీడింగ్‌ నమోదుకాక ఇబ్బందులు

బిల్లింగులో జాప్యంతో వినియోగదారులపై భారం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ నమోదులో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఈపీడీసీఎల్‌ ప్రవేశపెట్టిన ‘జియో ఫెన్సింగ్‌’ విధానం వినియోగదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. విద్యుత్తు మీటరు ఉన్న ప్రదేశానికి సిబ్బంది స్వయంగా వెళ్లి అక్కడే రీడింగ్‌ నమోదు చేయాల్సి ఉండడంతో కొత్త సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా నిర్ణీత గడువులోగా బిల్లింగ్‌ ప్రక్రియ పూర్తికాకపోవడంతో శ్లాబ్‌ మారిపోయి వినియోగదారులపై అదనపు భారం పడుతున్నది.

విద్యుత్‌ వినియోగానికి సంబంధించి ఈపీడీసీఎల్‌ అధికారులు నెలవారీ బిల్లులు వసూలు చేస్తుంటారు. ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో గృహ, వాణిజ్య, ఇతరత్రా వాటికి సంబంధించి మీటర్‌ రీడింగ్‌ తీసి, బిల్లును వినియోగదారులకు అందజేస్తుంటారు. మీటర్‌ రీడింగ్‌ ప్రక్రియను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు నియమించుకున్న సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, మీటర్‌ రీడింగ్‌ను నమోదు చేసి బిల్లు ఇస్తుంటారు. అయితే కొన్నిచోట్ల మీటర్‌ రీడింగ్‌ నమోదు విషయంలో సిబ్బంది, సంబంధిత గృహ యజమానులు కుమ్మక్కై తక్కువ రీడింగ్‌ నమోదు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాక సిబ్బంది పలు గృహాలకు వెళ్లకుండా తమకు తోచిన విధంగా రీడింగ్‌ నమోదు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇటువంటి అక్రమాలకు, నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేందుకు జీయో ఫెన్సింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను మీటర్‌ రీడింగ్‌ మిషన్లలో అమర్చారు. దీనివల్ల సిబ్బంది మీటర్‌ ఉన్న ప్రదేశానికి వెళ్లితేనే రీడింగ్‌ నమోదు చేయడానికి వీలవుతుంది. అంతేకాక ఎక్కువ లేదా తక్కువ యూనిట్లు నమోదు చేయడానికి వీలుకాదు. ఈ విధానాన్ని తొలుత కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఈ సందర్భంగా తలెత్తే సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయడంతో సమస్యలు ఎదురవుతున్నాయని రీడింగ్‌ సిబ్బంది వాపోతున్నారు. మీటరు ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పటికీ కొన్ని సందర్భాల్లో సాఫ్ట్‌వేర్‌ లోకేషన్‌ను గుర్తించకపోవడం, రీడింగ్‌ నమోదు కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మీటర్‌ రీడింగ్‌ నమోదుకు ఎక్కువ సమయం పడుతున్నదని అంటున్నారు.

గడువు ముంచుకొస్తున్నా...

వాస్తవానికి ప్రతి నెలా ఒకటో తేదీన మీటర్‌ రీడింగ్‌ ప్రక్రియను ప్రారంభించి 12వ తేదీలోగా ముగించాలి. కానీ కొత్త సాఫ్ట్‌వేర్‌ కారణంగా బిల్లింగ్‌ ప్రక్రియ మందగించడంతో నిర్ణీత గడువులోగా పూర్తి కాలేదని సిబ్బంది చెబుతున్నారు. రీడింగ్‌ సకాలంలో నమోదు చేయకకపోతే శ్లాబ్‌లు మారిపోయి, వినియోగదారుడిపై అనవసర భారం పడుతుందని అంటున్నారు. అందువల్ల సాఫ్ట్‌వేర్‌ లోపాలను సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నారు. విద్యుత్తు బిల్లింగ్‌లో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం స్వాగతించదగినదే అయినప్పటికీ, దీని అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సాఫ్ట్‌వేర్‌ లోపాలను గుర్తించి సకాలంలో రీడింగ్‌ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవడంతోపాటు, జాప్యం కారణంగా వినినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

70 శాతం బిల్లింగ్‌ పూర్తి

ప్రసాద్‌, ఈఈ, ఈపీడీసీఎల్‌

విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ నమోదులో అక్రమాలకు, సిబ్బంది నిర్లక్ష్యానికి చెక్‌ పెట్టేందుకే విద్యుత్‌ మీటర్లకు జియో ఫెన్సింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. సిబ్బంది తప్పనిసరిగా మీటర్‌ ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడే రీడింగ్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యతో మీటర్‌ రీడింగ్‌ నమోదులో జాప్యం జరిగితే.. సంబంధిత వినియోగదారులపై అదనపు భారం పడకుండా చూస్తున్నాం. ఆగస్టులో ఇప్పటి వరకు 70 శాతం విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి మీటర్‌ రీడింగ్‌ నమోదు పూర్తయ్యింది.

Updated Date - Aug 12 , 2026 | 12:32 AM