Share News

రూఫ్‌టాప్‌ సోలార్‌ అమరికలో ఇబ్బందులు

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:31 AM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టు’ల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు పలువురు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌కు ఫిర్యాదు చేశారు.

రూఫ్‌టాప్‌ సోలార్‌ అమరికలో ఇబ్బందులు

‘డయల్‌ యువర్‌ సీఎండీ’లో వినియోగదారుల ఫిర్యాదు

పలు అంశాలపై 48 మంది కాల్‌

సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని పృథ్వీతేజ్‌ హామీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టు’ల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు పలువురు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీఈపీడీసీఎల్‌ సోమవారం నూతనంగా ప్రారంభించిన ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమానికి తొలిరోజు 48 మంది వినియోగదారులు ఫోన్‌ చేసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడిలో ఎడతెగని జాప్యం, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు అంచనాలు ఇవ్వడంలో ఇక్కట్లు, విద్యుత్‌ లైన్ల మార్పు, స్తంభాల మార్పిడి, వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు, సరఫరాలో అంతరాయాలు వంటి అంశాలపై ఫిర్యాదు చేశారు. సీఎండీ పృథ్వీతేజ్‌ ఫిర్యాదులన్నీ నమోదు చేసుకున్నామని, త్వరితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. వీటన్నింటినీ కార్పొరేట్‌ కార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని, సమస్య వచ్చిన వెంటనే 1912కు ఫోన్‌ చేసి చెప్పవచ్చునని, లేదంటే 9493681912 వాట్సాప్‌ నంబరుకు చాటింగ్‌ ద్వారా తెలియజేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యప్రకాశ్‌, టి.వనజ, ఎస్‌.హరిబాబు, సీజీఎం విజయలలిత, జీఎం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 01:31 AM