మన్యంలో విభిన్న వాతావరణం
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:16 AM
అల్లూరి జిల్లా మన్యంలో శనివారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు.. తర్వాత నుంచి ఎండ, సాయంత్రం ఐదు గంటల తర్వాత వర్షం కురిసింది.
తెల్లవారుజామున పొగమంచు..
తర్వాత ఠారెత్తించిన ఎండ..
సాయంత్రం భారీ వర్షం
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
పాడేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని పలు మండలాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు అదే వాతావరణం కొనసాగిన తర్వాత పాడేరులో జల్లులు పడగా.. పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఏజెన్సీలో విభిన్న వాతావరణం ఏర్పడుతుండడంతో ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి. దీంతో శనివారం కొయ్యూరులో 23.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 22.6, పాడేరు, చింతపల్లిలో 22, అరకులోయలో 21.7, డుంబ్రిగుడలో 21.3, హుకుంపేటలోలో 21.2, పెదబయలులో 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో..
మండలంలోని శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో హుకుంపేట వారపు సంతలో దుకాణాలు వర్షానికి తడిసిపోయాయి. సంత ప్రాంగణం చిత్తడిగా మారింది. వర్షం కురవడంతో అమ్మకాలు జరగక వ్యాపారులు నిరాశ చెందారు. వ్యాపార సక్రమంగా జరగపోవడంతో నష్టపోతున్నామని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేశారు.
పెదబయలులో..
పెదబయలులో శనివారం సాయంత్రం భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండా కాసింది. సాయంత్రం 4 గంటల తరువాత భారీ వర్షం కురిసింది. దీంతో డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి.
ముంచంగిపుట్టులో..
మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రంలో వారపు సంతకు వచ్చిన వారు త్వరగతిన వెనుదిరిగారు. వర్షం ప్రభావం సంతపై తీవ్రంగా చూపించింది. ఆశించిన స్థాయిలో వ్యాపారాలు సాగకపోవడంతో సంత వ్యాపారులు తీవ్ర నిరాశ చెందారు. స్థానిక నాలుగు రోడ్లపై నుంచి, సీహెచ్‌సీకి వెళ్లే రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించింది. దీంతో అటుగా పాదచారులు సైతం రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలు చోట్ల వాగులు, వంకలు, గెడ్డలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు చిత్తడైపోయాయి. మట్టి రహదారులు బురదమయంగా మారాయి.