Share News

మన్యంలో విభిన్న వాతావరణం

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:51 PM

మన్యంలో శుక్రవారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసి, ఆ తర్వాత వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.

మన్యంలో విభిన్న వాతావరణం
జీకేవీధిలో కురుస్తున్న వర్షం

ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన

ఖరీఫ్‌ పనులకు అనుకూలం

కొయ్యూరులో 33.0 డిగ్రీల ఉష్ణోగ్రత

పాడేరు/చింతపల్లి/జీకేవీధి/హుకుంపేట, జూలై 10(ఆంధ్రజ్యోతి):

మన్యంలో శుక్రవారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసి, ఆ తర్వాత వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లా కేంద్రం పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పరిసర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. పలు మండలాల్లో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలులో సైతం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. తాజావర్షాలు ఖరీఫ్‌ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. ఏజెన్సీలో గతకొన్ని రోజులుగా వర్షం కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కొయ్యూరులో 33.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పాడేరులో 31.5, అనంతగిరిలో 30.5, చింతపల్లిలో 29.9, అనంతగిరిలో 30.5, పెదబయలులో 29.0, ముంచంగిపుట్టులో 26.8 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లి మండలంలోని శుక్రవారం భారీ వర్షం పడింది. ఈదురుగాలులతో కురిసిని వర్షానికి పాడేరు-చింతపల్లి ప్రధాన రహదారిపై లోతుగెడ్డ సమీపంలో భారీ వృక్షం పడింది. దీంతో రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు, అన్నవరం పోలీసులు చొరవతో వృక్షాన్ని తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

గూడెంకొత్తవీధి మండలంలో మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు వాతావరణం నెలకొన్నది. విడతల వారీగా వర్షం పడింది. వర్షానికి పెదవలస వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే గిరిజనుల వ్యవసాయ పనులకు ఆటంకం కలిగింది.

హుకుంపేట మండలంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. తర్వాత ఎండ కాసింది. దీంతో ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉద్యోగానికి వెళ్లేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో రోడ్లు చిత్తడిగా మారాయి. రాకపోకలకు జనం అవస్థలు పడ్డారు.

Updated Date - Jul 10 , 2026 | 10:51 PM