మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - May 25 , 2026 | 11:51 PM
మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం మూడు గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ, ఆ తరువాత భారీ వర్షం
అరకులోయలో అత్యధికంగా 40.7 డిగ్రీలు
పాడేరు, మే 25 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం మూడు గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం మొదలుకుని చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ఇదే వాతావరణం నెలకొంది. ఈదురుగాలుల ప్రభావానికి కొంత సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అరకులోయలో 40.7 డిగ్రీలు
సోమవారం అరకులోయలో అత్యధికంగా 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కొయ్యూరులో 40.2, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 40.0, చింతపల్లిలో 37.9, జి.మాడుగులలో 37.7, హుకుంపేటలో 36.3, అనంతగిరిలో 36.0, పెదబయలు, ముంచంగిపుట్టులో 35.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తరువాత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా మండలంలోని కోర్రా పంచాయతీ కోర్రా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు వంతల ప్రసాద్ అనే గిరిజనుడి ఇంటిపై భారీ చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ అధికంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. రోడ్లపై కూడా వర్షపు నీరు ప్రవహించింది.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలో ఎండల తీవ్రతకు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనం బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.