మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - May 03 , 2026 | 11:09 PM
మన్యంలో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి.
మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, జీకేవీధి మండలంలో భారీ వర్షం
పాడేరు, మే 3(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. అయితే జీకేవీధి మండలంలో వేకువజామున భారీ వర్షం కురిసింది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. అరకులోయలో 36.6, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 33.4, జి.మాడుగులలో 32.6, ముంచంగిపుట్టులో 32.4, పెదబయలులో 33.4, చింతపల్లిలో 31.9, కొయ్యూరులో 31.6, అనంతగిరిలో 31.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జీకేవీధి మండలంలో..
సీలేరు: జీకేవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ మాదిమళ్లు గ్రామంలో ఆదివారం వేకువజాము 4 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా నేలకొరిగింది. దీని వల్ల ధారకొండ- గుమ్మిరేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి, వాస్తవానికి ఆదివారం ధారకొండలో జరిగే వారపు సంతకు గుమ్మిరేవుల పంచాయతీ గ్రామాల గిరిజనులు వచ్చి నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసుకొని వెళుతుంటారు. అయితే రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో సంతకు రాలేక వారు ఇబ్బందులు పడ్డారు. కొందరు మహిళలు నడుచుకుంటూ పడిపోయిన చెట్టును దాటుకుని వెళ్లారు. పోలవరం జిల్లా సరిహద్దులో గల గుర్తేడు మండలంలోని అనేక గ్రామాల గిరిజనులు కూడా వారపు సంతకు రాలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.