Share News

మన్యంలో భిన్న వాతావరణం

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:09 AM

మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాయగా, కొన్నిచోట్ల మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది.

మన్యంలో భిన్న వాతావరణం
సీలేరులో వర్షం

ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన

పాడేరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాయగా, కొన్నిచోట్ల మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. ముఖ్యంగా అరకులోయ, హుకుంపేట, సీలేరు, తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. కాగా సోమవారం అరకులోయలో 36.1, కొయ్యూరులో 35.9, జి.మాడుగులలో 35.0, అనంతగిరిలో 33.0, పెదబయలులో 31.6, చింతపల్లిలో 29.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో...

అరకులోయ : పట్టణంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పొగమంచు, ఆ తరువాత మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, అనంతరం వర్షం కురిసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది.

హుకుంపేటలో..

హుకుంపేట: మండల కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వర్షం పడింది. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు.

జీకేవీధి మండలంలో..

సీలేరు: జీకేవీధి మండలంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ కాయగా, సాయంత్రం వర్షం కురిసింది. మండలంలో గత మూడు రోజులుగా ఇదే పరిస్ధితి నెలకొంది. అకాల వర్షాల వలన మామిడి తోటలు దెబ్బతిన్నాయని గిరిజన రైతులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడి మామిడికాయలు నేలరాలాయి. అలాగే చింతపండు తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండలంలో సోమవారం ఉదయం నుంచి ఎండ ఠారెత్తించింది. ఎండ కారణంగా మధ్యాహ్నం ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. వేడిగాలులు వీచడంతో జనం బయటకు రావడానికి సంకోచించారు.

Updated Date - Apr 07 , 2026 | 12:09 AM