మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:35 AM
మన్యంలో బుధవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం వేళ పొగమంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురిసింది.
ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం
ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జోరు వాన
పాడేరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం వేళ పొగమంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురిసింది. ముఖ్యంగా ఒడిశాకు సరిహద్దున ఉన్న ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం అరకులోయలో 13.8, ముంచంగిపుట్టులో 14.7, పెదబయలులో 15.3, జి.మాడుగులలో 18.8, అనంతగిరిలో 18.8, కొయ్యూరులో 20.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సీలేరు, ధారకొండల్లో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండ, దుప్పులవాడల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలంగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం కురిసింది. ధారకొండ ఘాట్‌రోడ్డు, ధారకొండలో గంటసేపు వడగళ్ల వర్షం కురిసింది. సీలేరులో సాయంత్రం ఐదు గంటల నుంచి గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన జనం ఉపశమనం పొందారు. సీలేరు భారీగా గాలులు వీయడంతో పలుమార్లు గ్రామంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం భారీ ఈదురుగాలులు వీచాయి. దీని వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురవడంతో రహదారులు చిత్తడిగా మారాయి. అకాల వర్షాల కారణంగా మామిడి పూత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.