తూనికల్లో తేడాలు, ప్యాకింగ్‌లో అక్రమాలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:10 AM
వినియోగదారులను చాలామంది వ్యాపారులు మోసగిస్తున్నారు.
వినియోగదారులను మోసగిస్తున్న అనేకమంది వ్యాపారులు
కూరగాయల నుంచి బంగారం విక్రయం వరకూ అంతా మోసమే...
ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీగా కేసులు నమోదు
గత ఆర్థిక సంవత్సరం 2,559 కేసులు నమోదు
రూ.1.64 కోట్లు జరిమానా
ఈ ఏడాది నాలుగు నెలల్లో 1,000 కేసులు
విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):
వినియోగదారులను చాలామంది వ్యాపారులు మోసగిస్తున్నారు. ఈ జాబితాలో కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారి నుంచి బంగారు ఆభరణాలు విక్రయించే దుకాణదారుల వరకూ అందరూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,559 కేసులు నమోదుచేసిన అధికారులు భారీగా జరిమానాలు విధించారు. తూనికల్లో మోసాలకు పాల్పడిన వారిపై 1,616 కేసులు, ప్యాకేజీ నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై 943 కేసులు నమోదు చేసి రూ.1,64,70,800 జరిమానా విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా సుమారు వెయ్యి కేసులు నమోదు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 24 వేల వరకు కాటా (ఎలక్ర్టానిక్/ఇతర కాటాలు) వినియోగించే ఎస్టాబ్లిష్‌మెంట్స్ (దుకాణాలు/షోరూమ్‌లు) ఉన్నాయి. వాటిని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ద్వారా వినియోగదారులను మోసం చేయకుండా నియంత్రించేందుకు యత్నిస్తుంటారు. అయితే, అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ అనేకచోట్ల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన ఏడాది అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఎక్కువగా కూరగాయల దుకాణాల్లో మోసాలకు పాల్పడుతుండడాన్ని గుర్తించారు. తూకంలో తేడాలు, స్టాంపులు లేని కాటాలు వినియోగిస్తున్న 297 మందిపై కేసులు నమోదుచేసి, రూ.2.8 లక్షలు జరిమానా విధించారు. అలాగే, చికెన్/మటన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 244 కేసులు నమోదుచేశారు. సదరు వ్యాపారులకు రూ.3.5 లక్షల జరిమానా విధించారు. గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే సంతాల్లో తప్పుడు కాటాలను వినియోగించి మోసాలు చేస్తున్న వ్యాపారులు, దళారులపై 96 కేసులు నమోదుచేసి, రూ.3.47 లక్షల జరిమానా విధించారు. అదేవిధంగా యూరియా, డీఏపీ వంటి ఎరువులను అధిక ధరకు విక్రయిస్తున్న 24 మంది వ్యాపారులపై కేసులు నమోదుచేసి రూ.14 లక్షలు జరిమానా విధించారు. బంగారు దుకాణాల్లో వినియోగదారులను మోసం చేయడంతోపాటు ప్యాకేజీ నిబంధనలు పాటించనందుకు 76 కేసులు నమోదుచేశారు. విక్రయించిన వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలు బిల్లుల్లో లేకపోవడం, తూకంలో తేడాలు వంటివి గుర్తించి పలు జ్యువెలరీ దుకాణాలకు రూ.24 లక్షల వరకు జరిమానా విధించారు. అలాగే, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బరువు తగ్గించడం, కమర్షియల్ సిలిండర్లను స్టిక్కర్లు లేకుండా విక్రయించినందుకు 28 కేసులు నమోదుచేసి, రూ.4 లక్షల జరిమానా విధించారు.
నిరంతరం తనిఖీలు
- కె.థామస్ రవికుమార్, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఈ తరహా మోసాలను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నారు. గడిచిన ఏడాది రెండు వేలకుపైగా కేసులు నమోదుచేసి రూ.1.64 కోట్లు జరిమానా విధించాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సిబ్బందిని పంపిస్తున్నాం. ప్యాకేజీ నిబంధనలు అమలు చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించినా, తూకంలో తేడాలు ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తాం. స్టాంపింగ్ రుసుము కింద గడిచిన ఏడాది రూ.4.15 కోట్లు వసూలు చేశాం.