Share News

డీజిల్‌ కొరత

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:44 AM

పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం విశాఖపట్నంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

డీజిల్‌ కొరత

సరఫరా తగ్గించిన ఆయిల్‌ కంపెనీలు

ఒకరికి 50 లీటర్లకు మించి ఇవ్వొద్దని ఆదేశాలు

ఒక ట్యాంకర్‌ను నాలుగు బంకులకు సర్దుతున్న ఐఓసీఎల్‌

అక్కడక్కడా నో స్టాక్‌ బోర్డులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం విశాఖపట్నంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఇంధన కొరత లేదని ప్రకటిస్తున్నా...ఇక్కడ మాత్రం అన్నింటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత వారం రోజులుగా విశాఖపట్నంలోని బంకుల్లో డీజిల్‌ సరిగా లభించడం లేదు. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ‘నో స్టాక్‌’ బోర్డు పెడతారో తెలియడం లేదు. ఇందులో తమ బాధ్యత ఏమీ లేదని బంకు యజమానులు చెబుతున్నారు. ఆయిల్‌ కంపెనీలే నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయని, డిమాండ్‌కు తగినంత సరఫరా చేయడం లేదని అంటున్నాయి.

యుద్ధం నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలు పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్‌ ధరను ఇప్పటికే లీటరుకు రూ.22 పెంచాయి. అంతా వాడేది ఒకటే డీజిల్‌ అయినా సాధారణ వినియోగదారులకైతే లీటరు రూ.96.24, అదే పరిశ్రమలకైతే అదనంగా మరో రూ.22 వసూలు చేస్తున్నారు. సాధారణ బంకు యజమానులు వారికిచ్చే డీజిల్‌ను పక్కదారి పట్టించి పరిశ్రమలకు అధిక ధరకు అమ్ముకుంటారనే ఆలోచనతో ఆయిల్‌ కంపెనీలు అడిగినంత ఇవ్వడం లేదు. గతంలో ఈ అమ్మకాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. యుద్ధం ప్రారంభమైన తరువాత ఒకరికి 300 లీటర్లకు మించి డీజిల్‌ అమ్మకూడదని ఆదేశించారు. అలా ఎవరైనా అమ్మితే ఆటోమేటిక్‌గా తెలిసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఆ తరువాత 150-200 లీటర్లకు మించి ఇవ్వవద్దని సూచించారు. దీనివల్ల బంకుల యజమానులు రెగ్యులర్‌ ఖాతాదారులకు కూడా అంతే విక్రయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిమితిని బాగా కుదించి ఒకరికి 50 లీటర్లే ఇవ్వాలని ఆంక్షలు పెట్టారు. అంత కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదని చెబుతున్నారు. దానికి అనుగుణంగా సరఫరా తగ్గించేశారు. ఒక బంకు రోజుకు మూడు ట్యాంకర్ల డీజిల్‌ విక్రయిస్తుంటే వారికి ఇప్పుడు ఒక ట్యాంకరే ఇస్తున్నారు. భారత్‌ పెట్రోలియం కంపెనీ వరకు ఎంతో కొంత సరఫరా చేస్తున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అయితే చాలా దారుణంగా ఉంది. 20 వేల లీటర్ల ట్యాంకర్‌ను నాలుగు బంకులకు సర్దుబాటు చేస్తోంది. అంటే ఒక్కో బంకుకు రోజుకు ఐదు వేల లీటర్లే ఇస్తున్నారు. దాంతో ఆయా బంకుల్లో డీజిల్‌ దొరకడం లేదు.

విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు డీజిల్‌ సరఫరా అవుతుంది. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌ బంకులు అన్నింటికీ కలిపి రోజుకు 950 కిలోలీటర్లు అంటే 9.5 లక్షల లీటర్ల డీజిల్‌ సరఫరా చేస్తున్నారు. దీనినే అందరినీ సర్దుకోవాలని సూచిస్తున్నారు. గతంలో ఇది 20 లక్షల లీటర్ల కంటే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సగానికి తగ్గించేశారు. వీరికి పంపిణీ చేసే డీజిల్‌ను పరిశ్రమలకు అమ్ముకుంటారేమోననే ఒకే ఒక్క అనుమానంతో సరఫరా తగ్గించేశారు. దీనివల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:44 AM