Share News

డీజిల్‌కు రేషన్‌!

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:17 AM

డీజిల్‌ సరఫరాపై పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

డీజిల్‌కు రేషన్‌!

ఒక వాహనానికి 200 లీటర్లే

బంకులకు తగ్గిన సరఫరా

లబోదిబోమంటున్న వాహనదారులు

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

డీజిల్‌ సరఫరాపై పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రం ఇంధన వనరుల వినియోగం తగ్గించడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆయిల్‌ కంపెనీల నష్టాలను పూడ్చడానికి ధర పెంచుకుంటూ వెళ్లాలని భావించినా, ఒకస్థాయి దాటితే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని తటపటాయిస్తోంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు, సరఫరాలపై ఆంక్షలు విధిస్తోంది.

తాజాగా ఒక వాహనానికి ఒక బంకులో 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్‌ ఇవ్వకూడదని ఉత్తర్వులు జారీచేసింది. బంకుల్లో విక్రయించే డీజిల్‌ లీటరు రూ.105 ఉండడం. పరిశ్రమలకు అందించే డీజిల్‌ ధర రూ.160కి చేరడంతో పక్కదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. బంకుల్లో డీజిల్‌ పరిశ్రమలకు మళ్లిస్తే అక్కడి యజమానులు లాభపడతారని, విక్రయాలపై ఆంక్షలు పెట్టింది. మరో వైపు సరఫరా కూడా తగ్గించింది. రోజుకు 30 వేల లీటర్ల ట్యాంకర్‌ తీసుకునే బంకుకు పదిశాతం కోత పెట్టి 27 వేల లీటర్లే ఇస్తున్నారు. పైగా రోజువారీ అమ్మకాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

భారీ వాహనాలకు ఇబ్బంది

సరకులు రవాణా చేసే లారీలో రానుపోను అవసరమైన డీజిల్‌ పోయించుకుంటారు. ఉదాహరణకు 1,500 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటే మూడు కిలోమీటర్లకు లీటరు చొప్పున 500 లీటర్లు ఒకేసారి యజమాని కొట్టిస్తారు. తాజాగా వాహనానికి 200 లీటర్లే ఇస్తామని చెప్పడంతో లారీలు మధ్యలో ఆగి మళ్లీ డీజిల్‌ కొట్టించుకోవలసి ఉంటుంది. ఈ బాధ్యత డ్రైవరుపైనే పెట్టి, ఆ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కొత్త సమస్యలు. విశాఖపట్నానికి అనేక ప్రాంతాల నుంచి సరకులతో వాహనాలు వస్తాయి. తిరిగి వెళ్లేటపుడు ఇక్కడ తక్కువ రేటు (ఆయిల్‌ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి) అని డీజిల్‌ పోయించుకుంటారు. ఇప్పుడు ఆంక్షల వల్ల అది సాధ్యం కాదు. బంకుల యజమానులు కూడా ఈ నిర్ణయాలపై పెదవి విరుస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోతున్నాయని, నిఘా ఎక్కువైందని, వినియోగదారులను సంతృప్తి పరచలేకపోతున్నామని వాపోతున్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:17 AM