Share News

ధారాలమ్మ నమోనమః

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:38 AM

జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో కొలువైన ధారాలమ్మ అమ్మవారి ప్రఽధాన పండుగ బుధవారం వైభవంగా జరిగింది. ధారకొండ గ్రామానికి చెందిన మహిళలు ఉదయం ఏడు గంటలకు భారీ ఎత్తున అమ్మవారి ఘటాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

ధారాలమ్మ నమోనమః
ధారాలమ్మ అమ్మవారి ఘటాలు, సారెలతో ఊరేగింపుగా వస్తున్న భక్తులు

వైభవంగా అమ్మవారి ప్రధాన పండుగ

ఆలయానికి పోటెత్తిన భక్తులు

సీలేరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో కొలువైన ధారాలమ్మ అమ్మవారి ప్రఽధాన పండుగ బుధవారం వైభవంగా జరిగింది. ధారకొండ గ్రామానికి చెందిన మహిళలు ఉదయం ఏడు గంటలకు భారీ ఎత్తున అమ్మవారి ఘటాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఘటాలను సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సీలేరుకు చెందిన రజకులు అమ్మవారి గరగలతో ఆలయం వద్ద సందడి చేశారు. అమ్మవారి ప్రధాన పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో పోటెత్తింది. టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, జీకేవీధి మండలం తహశీల్దార్‌ అన్నాజీరావు, జీకేవీధి సీఐ సుధాకర్‌ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ శాఖ తరఫున గిడ్డి ఈశ్వరి అమ్మవారికి పట్టు చీర సమర్పించారు. అనంతరం ఆమెను ఆలయ ఈవో సాంబశివరావు దుశ్శాలువాతో సత్కరించారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఆలయం భక్తులతో రద్దీగా ఉంది. మధ్యాహ్నం 3.57 గంటలకు అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి మహా నివేదన సమర్పించి ఆలయం తలుపులు మూసి వేశారు. గురువారం ఉదయం ఏడు గంటలకు ఆలయం తలుపులు తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఈవో తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:38 AM