రేపటి నుంచి ధారాలమ్మ అమ్మవారి ఉత్సవాలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:16 AM
జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో కొలువుదీరిన గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 6న ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా కొత్త అమావాస్య సందర్భంగా ధారాలమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు.
సీలేరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో కొలువుదీరిన గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 6న ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా కొత్త అమావాస్య సందర్భంగా ధారాలమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ధారాలమ్మ అమ్మవారి ఉత్సవాలకు ముహూర్తపు రాటను ఈ నెల 6న ఉదయం 9.39 గంటలకు వేసి ఉత్సవ పనులు ప్రారంభిస్తామని ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాల ముహూర్తపు రాట కార్యక్రమం అనంతరం అదే రోజు ఉదయం 11 గంటలకు అమ్మవారి గరగల అలంకరణ, పరిసర గ్రామాల్లో గరగల ఊరేగింపు చేపడతామన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న అమ్మవారి కలశ స్థాపన, ఈ నెల 18న అమ్మవారికి మహా నివేదన కార్యక్రమం నిర్వహించి ఆలయం తలుపులు మూసివేసి మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 19న అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుందని, అదే రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఽ