అంధకారంలో ధారకొండ
ABN , Publish Date - May 27 , 2026 | 11:53 PM
జీకేవీధి మండలం ధారకొండలో మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలి, వాన ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలడంతో పాటు పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఈదురుగాలుల బీభత్సంతో కూలిన చెట్లు
24 గంటలకు పైగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
సీలేరు, మే 27 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండలో మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలి, వాన ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలడంతో పాటు పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు చెట్లకొమ్మలు విద్యుత్ లైన్లపై పడడంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ధారకొండలో మంగళవారం రాత్రి 10 గంటల తరువాత ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ధారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ, ధారాలమ్మ ఘాట్‌రోడ్డులో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ధారకొండ ప్రధాన రహదారిపై రెండు చోట్ల భారీ వృక్షాలు కూలిపోగా, ఒక ఇంటిపై చింతచెట్టు పడడంతో ఆ ఇంటి పైకప్పు ధ్వంసం కావడంతో పాటు గోడ కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. ధారకొండ వద్ద రహదారిపై కూలిన చెట్లను ఆ గ్రామానికి చెందిన చీర్ల రమేశ్, గొర్లి బర్సయ్య, శెట్టి రాజు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. బుధవారం రాత్రి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో ఈ ప్రాంతవాసులు ఉక్కపోతకు అల్లాడిపోయారు.