పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:53 AM
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి జాగారం చేసిన భక్తులు సోమవారం ఉదయం సమీపంలోని సముద్రం, నదులు, జలాశయాలు, గెడ్డల్లో పుణ్యస్నానాలు ఆచరించారు.
జనసంద్రంగా మారిన సముద్ర, నదీ తీరాలు
కల్యాణపులోవకు రెండో రోజు మరింత తాకిడి
(ఆంధ్రజ్యోతి- న్యూస్ నెట్‌వర్క్)
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి జాగారం చేసిన భక్తులు సోమవారం ఉదయం సమీపంలోని సముద్రం, నదులు, జలాశయాలు, గెడ్డల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో ఆయా ప్రదేశాలు భక్తజనసంద్రంగా మారాయి. రావికమతం మండల కల్యాణపులోవ జలాశయం, పోతురాజుబాబు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు ఆదివారం రాత్రి ఇక్కడ జాగరణ చేశారు. వీరితోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సోమవారం వేకువజాము నుంచి రిజర్వాయర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పోతురాజుబాబు, పెద్దింటమ్మను దర్శించుకున్నారు. కాగా కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం ఉదయం ఇక్కడకు వచ్చి పోతురాజుబాబును దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ఉత్తరవాహినికి సోమవారం వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉత్తరవాహిని వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం తీరంలో కొలువై వున్న మల్లికార్జునస్వామిని దర్శించుకొన్నారు.
గొలుగొండ మండలం ధారమఠంలోని ఉమాధారమల్వీశ్వరస్వామి ఆలయానికి సోమవారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ముందు సమీపంలోని జలపాతంలో స్నానాలు చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు వచ్చినట్టు దేవదాయ శాఖ అధికారులు చెప్పారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి జాగరణ చేసిన భక్తులు సోమవారం ఉదయం రాంబిల్లి మండలం పంచదార్ల పుణ్యక్షేత్రంలో ఆకాశ ధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఫణిగిరిపై ఉమాధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు.
పాయకరావుపేట మండలంలోని పెంటకోట, రాజవరం, రాజానగరం, రత్నయమ్మపేట, పాల్మన్‌పేట గ్రామాల వద్ద సముద్ర తీరంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం సమీంలోని ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు.